కరోనా వైరస్ (కోవిడ్-19) ఏమోగానీ జనాలు దీని వల్ల బెంబేలెత్తిపోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అయితే ఓ వైపు ప్రజలు ఈ వైరస్ వల్ల తీవ్రమైన భయాందోళనలకు గురవుతుంటే.. కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా భావించి జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లో సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కరోనా వైరస్‌ను అడ్డు పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అయితే కింద తెలిపిన సూచనలు పాటిస్తే అలాంటి మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే…
* కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు కొన్ని ప్రత్యేకమైన మాస్కులు పనిచేస్తాయని కొందరు నకిలీ మాస్క్‌లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. నిజానికి కరోనా వైరస్‌ను అడ్డుకునే మాస్క్‌లు ఏవీ ప్రస్తుతం మార్కెట్‌లో లేవు. కనుక అలాంటి ప్రకటనలు చూసి మోసపోకండి.
* కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు ఎన్95 మాస్క్‌లు పనిచేస్తాయని కొందరు చెబుతూ వాటిని ఆన్‌లైన్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అయితే ఈ మాస్క్‌లు స్వైన్ ఫ్లూ రాకుండా చూస్తాయే కానీ.. కరోనా వైరస్‌ను ఆపలేవు. కనుక ఈ తరహా ప్రకటనలు చూసి కూడా మోసపోకండి.
* కరోనా వైరస్‌ను నాశనం చేస్తాయంటూ కొందరు ప్రబుద్ధులు ఆన్‌లైన్‌లో మందులు విక్రయిస్తున్నారు. నిజానికి ఆ వైరస్‌ను ఆపగలిగే మందులు ఏవీ ప్రస్తుతం మార్కెట్‌లో లేవు. ఈ వైరస్‌కు గాను వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైంటిస్టులు ఇప్పటికే తేల్చి చెప్పారు. కనుక కరోనా వైరస్‌ను అడ్డుకుంటాయని చెప్పి ఎవరైనా మందులను విక్రయిస్తే నమ్మకండి. అనవసరంగా డబ్బులు నష్టపోకండి.
* కరోనా వైరస్ గురించి వచ్చే వార్తలను నమ్మే ముందు ఒకసారి అవి నిజమేనా, కాదా అని నిర్దారించుకోండి. ఎందుకంటే ఒక్కోసారి పేరుగాంచిన వెబ్‌సైట్లలోనే తప్పుడు వార్తలు రావచ్చు. కనుక ఏది నిజం వార్త, ఏది నకిలీ వార్త అని తెలుసుకోకుండా ముందుగానే గుడ్డిగా ప్రతి వార్తను నమ్మకండి. అది నష్టాన్ని కలిగిస్తుంది.
* కరోనా వైరస్ ఉందా, లేదా అనే విషయాన్ని నిర్దారించుకునేందుకు ఆన్‌లైన్‌లో టెస్ట్ కిట్లు ఉన్నాయని, వాటిని అమ్ముతామని చెప్పి కొందరు ప్రకటనలు ఇస్తున్నారు. నిజానికి అలాంటి కిట్లు ఏవీ ప్రస్తుతం మార్కెట్‌లో లేవు. కేవలం హాస్పిటళ్లలోనే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. కనుక ఆ కిట్లను నమ్మి మోసపోకండి.
* కరోనా వైరస్ గురించి వాట్సాప్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే వార్తలను నమ్మే ముందు ఒక్కసారి అవి నిజమా, కాదా అనే విషయం ఆలోచించండి. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ఆయా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా పుకార్లే ప్రచారం అవుతున్నాయి.
* యూట్యూబ్ గానీ, ఇతర ఏ వెబ్‌సైట్‌లో గానీ కరోనా వైరస్ గురించి వైద్య సహాయం పొందకండి. మీకు కరోనా ఉందని అనిపించినా, ఆ లక్షణాలు ఉన్నా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోండి. సొంత వైద్యం చేసుకోకండి.