దేశవ్యాప్తంగా మంకీపాక్స్ కలవరం రేపుతోంది. చాపకింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అయితే కరోనాలా మరో మహమ్మారి కానుందా..? అని అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ కథనం కొంత ఊరటనిస్తోంది. కొన్ని యాంటీవైరస్ ఔషధాలకు మంకీపాక్స్ లక్షణాలను తగ్గించే సామర్థ్యం ఉందని ‘లివర్‌పూల్ హాస్పిటల్స్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్’కు చెందిన పరిశోధకులు తెలిపారు.
ఆస్పత్రిలో మంకీపాక్స్ సోకిన కొంతమందికి బ్రిన్సిడోఫోవిర్, టీకోవిరిమాట్ అనే రెండు యాంటీవైరస్ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా ఈ ఫలితాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిని స్మాల్‌పాక్స్ చికిత్సలో వినియోగిస్తారు. దీంట్లో బ్రిన్సిడోఫోవిర్ మంచి ఫలితాలు ఇచ్చినట్లు వెల్లడించారు. టీకోవిరిమాట్‌పై ఇంకా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. మంకీపాక్స్ ఆనవాళ్లను రక్తం, గొంతు నుంచి తీసిన నమూనాల ద్వారా గుర్తించినట్లు తెలిపారు.