జూలై 11 నుంచి పాక్ యుద్ధంలో వెనుకడుగు వేసింది. జూలై 14వ తేదీన పాక్‌పై చేపట్టిన ఆపరేషన్ విజయ్ సక్సెస్ అయిందని అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రకటించారు. జూలై 26వ తేదీన యుద్ధం ముగిసింది. అందులో పాక్ ఓడిపోయింది.
కార్గిల్ యుద్ధం.. భారత్, పాకిస్థాన్‌ల మధ్య 1999వ సంవత్సరం మే, జూలై నెలల్లో దాదాపుగా 60 రోజులకు పైగా జరిగింది. భారత్‌లోని పలు కీలకమైన భూభాగాలను, సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించేందుకు పాక్ చేసిన యత్నాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. కార్గిల్ సమీపంలో పెద్ద ఎత్తున పాక్ సైనికులు, ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్నభారత్ మొదటగా వాయుసేన ద్వారా దాడులు ప్రారంభించింది.
1999, మే 5వ తేదీన భారత్ గస్తీ కోసం పంపిన 5 మంది సైనికులను పాక్ నిర్బంధించి వారిని చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. ఆ తరువాత పాక్ సైన్యం మే 9న కార్గిల్‌లో ఉన్న భారత ఆయుధాగారాన్ని నాశనం చేసింది. మే 10న ద్రాస్, కక్సార్, ముష్ఖో సెక్టార్లలో పాక్ సైనికులు, ఉగ్రవాదులు ఉన్నారని భారత సైన్యం గుర్తించింది. ఆ తరువాత కొద్ది రోజుల పాటు కాశ్మీర్ లోయ గుండా మరింత మంది సైనికులను భారత్ కార్గిల్ సెక్టార్‌కు పంపింది. అనంతరం మే 26వ తేదీన చొరబాటుదారులపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. ఈ క్రమంలో మే 27న భారత వాయుసేనకు చెందిన మిగ్-21, మిగ్-27 విమానాలను, 28న ఎంఐ-17 హెలికాప్టర్‌ను పాక్ కూల్చేసింది. పలువురు భారత పైలట్లు, సిబ్బంది మృతి చెందారు.
ఆ తరువాత జూన్ 1వ తేదీన పాకిస్థాన్ భారత్‌పై దాడులను మరింత ముమ్మరం చేసింది. భారత్‌లోని జాతీయ రహదారి 1ఎపై బాంబులు వేసింది. జూన్ 5న పాక్ సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను భారత సైన్యం బయట పెట్టి పాక్ ప్లాన్‌ను భారత్ ప్రపంచానికి తెలియజేసింది. మరుసటి రోజు.. అంటే.. జూన్ 6న భారత సైన్యం పాక్‌పై పెద్ద ఎత్తున దాడి చేసింది. పాక్ ఆక్రమించుకున్న బటాలిక్ సెక్టార్‌లోని రెండు కీలక స్థావరాలను భారత్ జూన్ 9న తిరిగి స్వాధీనం చేసుకుంది. జూన్ 13న ద్రాస్ సెక్టారులోని తోలోలింగ్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.
జూన్ 15వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఫోన్ చేసి కార్గిల్ నుంచి పాక్ సేనలు వెళ్లిపోవాలని సూచించారు. జూన్ 29వ తేదీన భారత సైన్యం టైగర్ హిల్ వద్ద ఉన్న రెండు కీలక స్థావరాలను (పాయింట్ 5060, పాయింట్ 5100) స్వాధీనం చేసుకుంది. జూలై 4న టైగర్ హిల్ ఏరియా మొత్తం భారత నియంత్రణలోకి వచ్చింది. జూలై 5న ద్రాస్ సెక్టార్‌ను, జూలై 7న బటాలిక్ సెక్టార్‌లోని జుబర్ హైట్స్‌ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో జూలై 11 నుంచి పాక్ యుద్ధంలో వెనుకడుగు వేసింది. జూలై 14వ తేదీన పాక్‌పై చేపట్టిన ఆపరేషన్ విజయ్ సక్సెస్ అయిందని అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రకటించారు. జూలై 26వ తేదీన యుద్ధం ముగిసింది. అందులో పాక్ ఓడిపోయింది. పాక్ చొరబాటుదారులు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయారని భారత్ ప్రకటించింది. దీంతో కార్గిల్ యుద్ధంలో భారత్ విజయ పతాకాన్ని ఎగుర వేసింది. ఈ యుద్ధంలో త్రివిధ దళాలు చూపిన పోరాట పటిమకు, చేసిన త్యాగాలకు యావత్ భారత ప్రజానీకం నీరాజనాలు అర్పించింది. దీంతో జూలై 26వ తేదీని అప్పటి నుంచి కార్గిల్ విజయ్ దివస్‌గా వ్యవహరిస్తున్నారు..!