కరోనాను ముందే పసిగట్టిన వైద్యుడిని బలితీసుకున్న మహమ్మారి

-

 

కరోనా వైరస్‌ లీలలు అన్నీ ఇన్నీకావు. ఈ వైరస్‌ బారినపడి మరణించిన వారిలో కొందరివైతే హృదయవిధారక గాథలు. కాళ్లుచేతులు చచ్చుబడి మంచానికే పరిమితమైన 17 ఏండ్ల కొడుకును అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఓ నిరుపేద తండ్రి కరోనాసోకి ఆస్పత్రి పాలైతే.. ఆ కొడుకు బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్లు ఇచ్చేవారు లేక ఆకలికి అలమటించి అలమటించి ప్రాణాలు కోల్పోయిన ఘటన పలువురి హృదయాలను కలచివేసింది. మరోచోట కరోనా సోకిన ఇద్దరు వృద్ధ దంపతులు ఆస్పత్రిలోని పక్కపక్క మంచాల్లో జీవచ్ఛవల్లా పడివుండి.. మాట్లాడుకునే శక్తి కూడా లేక ఒకరి చేతిపై మరొకరు చేయి వేసుకుని చేతి స్పర్శలతోనే ఓదార్చుకుంటన్న తీరు చూపరుల గుండెలను పిండేసింది.

ఇదే కోవకు చెందిన మరో ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ను ముందే పసిగట్టిన వుహాన్‌ సెంట్రల్‌ హాస్పిటల్‌ వైద్యుడు లీ వెన్‌లియాంగ్‌ అదే వైరస్‌ సోకి మృతిచెందాడు. గత డిసెంబర్‌లో ఆస్పత్రికి వైరల్‌ వ్యాధులతో వచ్చే రోగుల తాకిడి బాగా పెరుగడంతో ఇది సార్స్‌ లాంటిదే మరో భయంకరమైన వైరసని, అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించడం మొదలుపెట్టాడు. ఈ విషయం స్థానిక పోలీసుల తెలియడంతో వారు ఆస్పత్రికి వచ్చి.. ప్రజలను అనవసరంగా భయభ్రాంతులకు గురిచేస్తే కఠినచర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెన్‌లియాంగ్‌కు వార్నింగ్‌ కూడా ఇచ్చివెళ్లారు. అయితే వెన్‌లియాంగ్‌ అనుమానించినట్లుగానే ఆ వైరల్‌ వ్యాధికి కారణం సార్స్‌ కంటే భయంకరమైన కరోనా వైరస్‌ అని ఆ తర్వాత తెలిసింది.

ఇదిలావుంటే డా. వెన్‌లియాంగ్‌ మరణించాడన్న వార్త చైనా అంతటా దావానలంలా వ్యాపించింది. దీంతో చైనా ప్రజలు ఎక్కడికక్కడ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. వందలమందిని పొట్టనపెట్టుకుంటున్న ఈ వైరస్‌ను ముందే పసిగట్టిన వెన్‌లియాంగ్‌ అదే వైరస్‌కు బలికావడం గురించి చర్చించుకుని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకు చైనాలో 638 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 31,000 మంది ఈ వైరస్‌ బారినపడి ఆస్పత్రుల పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version