నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ జోరు పెంచింది. పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం ముమ్మరం చేసింది. ఈ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ అందుకు అనుగుణంగా ప్రచారంలో దూకుడుగా ముందుకెళుతోంది. తాజాగా మంత్రి ఆర్.కె.రోజా రంగంలోకి దిగి ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పై రోజా విరుచుకుపడ్డారు. విమర్శలు, ప్రశ్నల వర్షం కురిపించారు.
అంతేకాదు ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. నామమాత్రపు పోటీలో బీజేపీ నిలవడం అవసరమా? అని మంత్రి రోజా ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏపీలో అమలవుతున్న పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని అడిగారు.”బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమ్మ ఒడి లేదు?. ఎందుకు వైయస్సార్ చేయూత లేదు?. ఎందుకు ఆసరా లేదు?. నాడు నేడు ఎందుకు అమలు చేయడం లేదు?. వాళ్ల రాష్ట్రాల్లో ఇవన్నీ ఎందుకు అమలు చేయడం లేదో మీరు అడగాల్సిన అవసరం ఉంది” అని ఓటర్లను ఉద్దేశించి రోజా అన్నారు.