సోషల్ మీడియాలో ప్రస్తుతం గూగుల్ పే (Google Pay)కు వ్యతిరేకంగా అనేక పోస్టులు షేర్ అవుతున్నాయి. గూగుల్ పే సురక్షితం కాదని, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జాబితాలో గూగుల్ పే లేదని, కనుక ప్రజలు ఆ యాప్‌లో డబ్బులు పంపుకోవద్దని, అది సురక్షితం కాదని.. రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇది నిజమేనా ? గూగుల్ పే సురక్షితం కాదా ? అందులో డబ్బులు పంపుకోకూడదా ? అనే విషయాలపై NPCI వివరణ ఇచ్చింది.
గూగుల్ పే అనేది ఓ థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ (TPAP). ఇది ఇతర యూపీఐ యాప్‌లలాగే పేమెంట్ సర్వీసులను అందజేస్తుంది. ఎన్‌పీసీఐకి చెందిన యూపీఐ నియమ నిబంధనలను పాటిస్తూ, ఇతర బ్యాంకులతో కలిసి గూగుల్ పే యూజర్లకు యూపీఐ సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో యూజర్లు గూగుల్ పే మాత్రమే కాదు, దాని లాంటి ఇతర TPAP యాప్‌ల ద్వారా కూడా యూపీఐ విధానంలో సురక్షితంగా డబ్బులు పంపుకోవచ్చు. అందువల్ల గూగుల్ పే సురక్షితం కాదు అని వస్తున్న వార్తల్లో నిజం లేదు.. అని ఎన్‌పీసీఐ వివరణ ఇచ్చింది.
దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపు సేవలను అందిస్తున్న అన్ని TPAP యాప్‌లు ఎన్‌పీసీఐ, ఆర్‌బీఐ నియమ నిబంధనలను పాటించాలి. దేశంలోని అన్ని చట్టాలు ఆయా యాప్‌లకు వర్తిస్తాయి. యూపీఐ విధానం ద్వారా వినియోగదారులు పూర్తిగా సురక్షితంగా డబ్బులు పంపుకోవచ్చు. కానీ వారు తమ ఓటీపీ, యూపీఐ పిన్‌లను ఇతరులకు ఎట్టి పరిస్థితిలోనూ చెప్పరాదు.. అని NPCI తెలియజేసింది. కనుక యూజర్లు ఎలాంటి ఆందోళన చెందకుండా గూగుల్ పేను వాడుకోవచ్చు.