ఇంట్లో బామ్మ ఒంటరిగా ఉండి బోర్ ఫీల్ అవుతుందా.. వీరికి కాల్ చేయండి. మంచి కాలక్షేపం..!

-

ఒకప్పుడు అంటే.. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.. మధ్యాహ్నం తిన్నాక తీరిగ్గా కబుర్లు చెప్పుకునే వాళ్లు.. పొరుగింటి వారితో ముచ్చట్లు, సాయంకాలం వేళల్లో సరదాగా షికార్లు ఇవన్నీ చేసేవాళ్లు. ఇప్పుడు ఇంట్లో ఉండే జనాభా సంఖ్య తక్కువ. ఉన్నవాళ్లు కూడా ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లిపోతున్నారు. మరి ఇంట్లో ఉండే బామ్మకు, అమ్మకు కబుర్లు ఎవరు చెప్తారు, ఆమెతో చెస్, క్యారమ్స్ ఎవరు ఆడతారు. బయట ఏదైనా పని ఉంటే.. ఎవరు తీసుకెళ్తారు. ఇంట్లో వాళ్లా అందుబాటులో ఉండరు. ఒకవేళా తప్పదు చేయాలంటే.. ఏదైనా పని ఉంటే చేస్తారు కానీ.. బామ్మ, తాతల దగ్గర కుర్చోని ముచ్చట్లు పెట్టేంత టైం వారికి ఉండటం లేదు కదా.. ఇలాంటి వారి కోసమే ఓ సంస్థ ముందొచ్చింది. ఎల్డర్లీ కేర్‌/ఫ్యామిలీ కంపానియన్‌ సంస్థలు. పెద్దవాళ్లకోసమే ఏర్పాటైన ఈ సంస్థలు మనం పైన చెప్పుకున్న పనులన్నీ చేస్తాయి.. ఇంకా ఏం ఏం సేవలు అందిస్తాయంటే..

ఇంట్లో కాలక్షేపం కావడంలేదు. కాసేపు సరదాగా క్యారంబోర్డో, చెస్సో ఆడాలని ఉంది కానీ తోడెవరూ లేరు అనుకున్నా ఆ సిబ్బంది వచ్చి ఆడి వెళ్తారు.

డెబ్బైఏళ్ల బామ్మగారు బ్యాంకుకో, పెన్షన్‌ తెచ్చుకునేందుకో, నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకో, బంధువుల ఇళ్లకో వెళ్లాలి. కానీ ఒక్కతే వెళ్లలేరు కదా. అలాంటప్పుడు ఈ సంస్థల్ని సంప్రదిస్తే వాళ్ల ఉద్యోగి వచ్చి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి, పనులన్నీ పూర్తిచేయించి మళ్లీ ఇంట్లో దింపి వెళ్తారు.

వాకింగ్‌కు తీసుకెళ్లాలన్నా, పెద్దవాళ్ల పక్కన కూర్చుని టీవీ సీరియళ్లు చూడాలన్నా, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలన్నా వాళ్లు వస్తారు. వాళ్లు ఈ పనుల్ని ఏదో యాంత్రికంగా కాకుండా సరదాగా కబుర్లు చెబుతూ, నవ్వుతూ- నవ్విస్తూ ఇంట్లోవాళ్లలానే ప్రవర్తిస్తూ నిర్వర్తిస్తారు.

ఇలా పనిచేసే ఉద్యోగులు ఒకటి రెండు గంటల నుంచీ రోజంతా తోడు ఉండమన్నా ఉంటారు. వాళ్లు ఉండే సమయాన్ని బట్టి ఫీజును వసూలు చేస్తాయి సంస్థలు.

ఈ సేవలు ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగళూరు… వంటి పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ‘అన్వయ’, ‘ద ఫ్యామిలీ మెంబర్‌’, ‘ఆజీ కేర్‌’, ‘మాయా కేర్‌’, ‘సంవేదన సీనియర్‌ కేర్‌’.. వంటివి అలాంటి సంస్థల్లో కొన్ని.

ఎవరో తెలియని వ్యక్తులు… ఇళ్లకు వచ్చి, ఏదయినా అఘాయిత్యం తలపెడితే… అనే సందేహం మనకు ఈపాటికే వచ్చి ఉండాలే.. అయితే ఈ సంస్థలు పూర్తి వివరాలు సేకరించి, నమ్మకస్తులని అనుకున్నవారినే తమ ఉద్యోగులుగా నియమించుకుంటాయి కాబట్టి అలాంటి భయాలేవీ అక్కర్లేదు.

ఆప్యాయంగా మాట్లాడుతూనే ఆదాయం పొందుతున్నారు. కొందరు డబ్బులు ఉన్నా కానీ..తోడు ఎవరూ లేరే అనే ఫీలింగ్ లో ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి సంస్థలు చక్కటి పరిష్కారమనే చెప్పాలి. మనవడు, మనవరాలు వచ్చినట్లే అనిపిస్తుందట వృద్ధులకు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version