అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఇక ఆ దేశానికి మనం వెళ్లలేమా ? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై కఠినమైన నిర్ణయం తీసుకోనున్నారా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే అమెరికా త్వరలో హెచ్1బీ వీసాతోపాటు పలు ఇతర వర్క్ వీసాల జారీని నిలిపివేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా అనేక లక్షల మంది అమెరికన్లు జాబ్‌లను పోగొట్టుకున్నారు. దీంతో వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటే.. విదేశీయులు అమెరికాకు రాకుండా కట్టడి చేయాలని, అందుకు ముందుగా వర్క్ వీసాల జారీని నిలిపివేయాలని ట్రంప్ ఆలోచిస్తున్నారట. అందుకనే ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికాలో ఇప్పటికే అనేక లక్షల మంది విదేశీయులు పలు వర్క్ వీసాలపై పని చేస్తున్నారు. వారిలో భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగులే ఎక్కువ. వీరు హెచ్1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు. అయితే కరోనా కారణంగా అనేక కంపెనీలు అక్కడ మూతపడడం, పనిలేకపోవడంతో ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించాయి. దీంతో ఇప్పటికే కొన్ని వేల మంది భారతీయులు తిరుగు ప్రయాణమయ్యారు. కరోనా వల్ల ఉన్న జాబ్ పోవడం, కొత్తగా ఉద్యోగం దొరకకపోవడం, మరోవైపు వీసా గడువు ముగియడంతో అనేక మంది ఇంటి బాట పట్టారు. అయినప్పటికీ అక్కడ విదేశీయులే కాదు, పెద్ద సంఖ్యలో అమెరికన్లు కూడా ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో వారికి ఉపాధి కల్పించడం కోసం ట్రంప్ సర్కారు త్వరలో కఠినమైన నిర్ణయాన్ని తీసుకోనుందని తెలిసింది.
అమెరికాలో హెచ్-1బీ (లాంగ్ టర్మ్ వర్క్ వీసా), హెచ్-2బీ (షార్ట్ టర్మ్ వీసా), జే-1 (షార్ట్ టర్మ్ వీసా), ఎల్-1 (కంపెనీల్లో ఉద్యోగుల అంతర్గత ట్రాన్స్‌ఫర్లకు ఉపయోగించే వీసా) తదితర వీసాలపై అనేక మంది విదేశీయులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయితే ఈ వీసాల జారీని నిలిపివేయడం వల్ల ఇకపై విదేశీయులు అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లేందుకు వీలు కాదు. వీరిలో ఎక్కువగా నష్టపోయేది భారతీయులే. కానీ ఈ విషయంపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ అమెరికన్లే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పి అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్ వారికి వ్యతిరేకంగా అయితే నిర్ణయం తీసుకోరు. కనుక విదేశీయులకు వర్క్ వీసాల జారీ నిలిపివేత అనే విషయం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే నిజమైతే ఇక విదేశీయులు అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లలేరు. తరువాత మళ్లీ ఎప్పుడు అమెరికా అక్కడ ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తుందో కూడా తెలియదు. దీంతో అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. మరి ట్రంప్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.