అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సారి కూడా ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వైద్యులు అధికారికంగా వెల్లడించారు. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయనకు కరోనా లక్షణాలు లేవని తెలిపారు. అయితే ఈ సారి ట్రంప్‌కు కరోనా పరీక్షలు నిర్వహించడానికి వైట్‌హౌస్ వైద్యులు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. ర్యాపిడ్ పాయింట్ కేర్ పద్ధతిలో ఆయనకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పద్ధతిలో శాంపిల్స్ సేకరించడానికి ఒక నిమిషం.. ఫలితాలు వెలువడానికి 15 నిమిషాలు పట్టిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
‘నేను ఈ రోజు ఉదయమే కరోనా పరీక్షలు చేయించుకున్నాను. దీనికి నాకు ఒక నిమిషం సమయం మాత్రమే పట్టింది. కేవలం 15 నిమిషాల్లో ఫలితం వచ్చింది. కానీ నేను దాని కోసం ఆగకుండా నా విధులకు హాజరయ్యాను. ఆ తర్వాత నాకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలుసుకున్నాను. నేను రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను. కానీ రెండో సారి అవలంభించిన విధానం చాలా సులువుగా ఉంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, మార్చి రెండో వారంలో ట్రంప్ తొలిసారిగి కరోనా పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. బ్రెజిల్ అధ్యక్ష ప్రతినిధి బృందంతో సమావేశం అనంతరం.. ఆ బృందంలోని సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ట్రంప్ పరీక్షలు చేయించుకున్నారు. మరోవైపు అమెరికాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యధికంగా అమెరికాలో 2.3 లక్షలకు పైగా కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. అమెరికాలో కరోనా బారినపడి 5 వేల మందికి పైగా మృతిచెందారు.