దీపావళి పండుగకు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ క్రాకర్స్ కాలుస్తుంటారు. సాయంకాలం లక్ష్మీదేవి పూజ పూర్తయ్యాక ఈ ప్రక్రియ ఉంటుంది. అయితే, ఈ మధ్యకాలంలో వాతావరణ కాలుష్యం అధికం అవుతున్నందున టాపాసులకు దూరంగా ఉండాలని పర్యావరణ వేత్తలు పిలుపునిస్తున్నారు. పెట్స్ లవర్స్ సైతం పటాకులు కాల్చొద్దని, పక్షులు, జంతువులు భయపడిపోతున్నాయని నెట్టింట పిలుపునిస్తున్నారు.
అయినప్పటికీ కొందరు ఏడాదికి ఒకసారి వచ్చే దీపావళికి టపాసులు పేల్చక పోతే ఎలా అని అనుకుని కాలుస్తున్నారు. అటువంటి వారికోసం గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచన చేశారు. లక్ష్మీదేవి బొమ్మ ఉండే టపాసులు పేల్చవద్దని పిలుపునిచ్చారు.‘ లక్ష్మీదేవికి పూజ చేస్తాం. ఆ మాత బొమ్మ పెట్టి టపాసులు అమ్ముతున్నారు. ఎప్పటి నుంచో ఈ కుట్ర జరుగుతోంది. అలాంటివి కొనొద్దు, కాల్చొద్దు. ఇలా సంకల్పం తీసుకుంటే మరోసారి ఇలాంటి టపాసులు తయారు చేయరు’ అని చెప్పారు. అలాగే పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.