చాలా మంది జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, మతిమరుపును తగ్గించుకోవడానికి నానపెట్టిన బాదంను రోజూ ఉదయం తింటారు. కానీ రాత్రి వాటిని నానపెట్టడం మర్చిపోతారు.. ఫన్నీ కదా..! అతి కష్టం మీద వాటిని నానపెట్టుకోని రోజూ తినే వాళ్లూ ఉన్నారు. నాలుగైదు బాదం గింజలు తింటే ఓకే. అంతకంటే ఎక్కువగా వీటిని తినడం వల్ల ముఖ్యంగా శీతాకాలంలో కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
మలబద్ధకం:
బాదం గింజల్లో పీచు పదార్థం, పొటాషియంలు అధికంగా ఉంటాయి. నాలుగైదు గింజలను మాత్రమే తీసుకుంటే వీటి వల్ల సానుకూల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇవి పేగుల కదలనికను ప్రోత్సహించి సాఫీగా మల విసర్జన జరిగేలా చేస్తాయి. అయితే అంతకంటే ఎక్కువగా తింటే మాత్రం అజీర్ణం, మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, ఇతర గ్యాస్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నాలుగైదు కంటే ఎక్కువగా తింటున్నారు అనుకున్నప్పుడు నీటిని కూడా అదనంగా తీసుకోవడం వల్ల కాస్త ఉపశమనం దొరుకుతుంది.
పోషకాల శోషణలో లోపం:
అధికంగా బాదం తీసుకోవడం వల్ల అదనంగా పీచు పదార్థాలు కూడా మన శరీరంలోకి వస్తాయి. దానితో పాటుగా ఇది సైటిక్ యాసిడ్‌ని కలిగి ఉంటుంది. దీని వల్ల మన శరీరం కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ లాంటి ఖనిజాలను సరిగ్గా శోషించుకోలేదు. అలాగే వీటిలో క్యాలరీలూ ఎక్కువగా ఉంటాయి. శీతాకాలంలో సాధారణంగా మనుషుల జీవ క్రియ మెల్లగా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ క్యాలరీలను లోపలికి తీసుకుంటే తప్పకుండా బరువు పెరిగే ప్రమాదమూ ఉంటుంది.
కిడ్నీల్లో రాళ్లు:
వీటిలో ఆక్సలేట్లనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి తోర్పడతాయి. అప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్న వారు, ఒకసారి కిడ్నీల్లో రాళ్లతో బాధలు పడిన వారు వీటిని తినడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీటిలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లతో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అలా కాకపోతే దీని వల్ల వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. అవి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి
విటమిన్ ఈ:
బాదాంను అధికంగా తినడం వల్ల విటమిన్ ఈ అనేది ఎక్కువగా మన శరీరంలోకి చేరిపోతుంది. ఈ విటమిన్ ఓవర్ డోస్ అయిపోతే విరోచనాలు, పొట్టలో కూతలు, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే వీటిని ఎక్కువగా తినడం వల్ల నోటి సంబంధిత ఎలర్జీలు వచ్చే ఆస్కారం ఉంటుంది. నాలుక, నోరు, పెదాలు, గొంతు లాంటివి ఒరుసుకుపోయినట్లు అవుతాయి.
ఎముకలకు ప్రమాదం:
బాదంలో ఎక్కువ మొత్తంలో పాస్ఫరస్ ఉంటుంది. ఇది కాల్షియంతో కలిసి ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. అయితే ఎక్కువ మొత్తం పాస్ఫరస్ లోపలికి వస్తే వీటి రెండింటి బ్యాలెన్స్ చెడిపోతుంది. అందువల్ల ఎముకలు బలహీనం అవుతాయి.