కిడ్నీలో చిన్నరాళ్లను లైట్‌ తీసుకోవద్దు..! ఐదేళ్లకు సీన్‌ రిపీటే..!

-

కిడ్నీలో రాళ్ల సమస్యకు ఒక స్జేట్‌ వరకే ఇంటి చిట్కాలు, సొంత వైద్యాలు పనిచేస్తాయి. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే.. వైద్యులు శస్త్రచికిత్స చేసి రాళ్లు తీస్తారు. అయితే ఇలా రాళ్లు తీసే క్రమంలో.. శస్త్రచికిత్స నిపుణులు చిన్న రాళ్లను వదిలేస్తుంటారు. వాటివల్ల పెద్దగా సమస్య ఉండదులే అని ఇలా చేస్తుంటారు. ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తికి కూడా వాటివల్ల అప్పుడు ఎలాంటి సమస్యా ఉత్పన్నమవదు..కానీ కొన్ని ఏళ్లు మొక్కపెరిగి వృక్షం అయినట్లు.. ఈ చిన్న రాళ్లు కాస్తా పెద్ద రాళ్లు అవుతాయి.. ఆ తర్వాత మళ్లీ సీన్‌ రిపీట్..!

చిన్న కిడ్నీరాళ్లు పెద్దగా ఇబ్బంది కలిగించవు. కిడ్నీ రాళ్లను తొలగించేటప్పుడు శస్త్రచికిత్స నిపుణులు వీటిని అలాగే వదిలేస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఐదేళ్లలో రాళ్లు తిరిగి ఏర్పడే అవకాశం ఎక్కువవుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనంలో తెలిపింది. సాధారణంగా శస్త్రచికిత్స చేసేటప్పుడు 6 మి.మీ. కన్నా చిన్న రాళ్లను నిపుణులు ముట్టుకోరు. వీటిని నిశితంగా గమనిస్తుంటారు. ఎందుకంటే మూత్రమార్గంలోకి వస్తే ఇవి తేలికగా బయటకు వచ్చేస్తాయట. వీటికి చికిత్స చేయటంపై డాక్టర్లలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.. రాళ్లు పెద్దగా లేకపోతే అంతగా పట్టించుకోరు.

అయితే ఇలాంటి రాళ్లనూ తొలగిస్తే తిరిగే ఏర్పడే అవకాశం 82 శాతం వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు. అందువల్ల పెద్ద రాళ్లతో పాటు చిన్న, ఇబ్బందులు కలిగించని కిడ్నీలో రాళ్లను కూడా తొలగించటమే మేలని వారు సూచిస్తున్నారు. ఇందుకు కాస్త ఎక్కువ సమయం పట్టినా, ఖర్చు ఎక్కువ అయినా మళ్లీ రాళ్లు ఏర్పడినప్పుడు చేసే చికిత్సతో పోలిస్తే తక్కువేనని గుర్తుచేస్తున్నారు. మళ్లీ రాళ్లు ఏర్పడటం వల్ల డబ్బు ఒక్కటే కాదు.. ఆ పెయిన్‌ మళ్లీ అనుభవించాలి. తరచూ శస్త్ర చికిత్స అంటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది.

అయితే కిడ్నీలో రాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకున్న వారు ఆపరేషన్‌ తర్వాత.. కిడ్నీలు క్లీన్‌ అయిపోయాయి కదా అని మళ్లీ మీ దందా షురూ చేయకుండా.. ఈ సారి నుంచి రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏ ఆహారం తింటే కిడ్నీలు క్లీన్‌ అవుతాయి, ఏ ఆహారం తింటే చిన్న రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు వస్తాయో తెలుసుకుని వాటిని తినాలి. అన్నింటికంటే ముందు వాటర్‌ ఎక్కువగా తాగాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version