పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ఆరోగ్యం పరిస్థితి విషమంగా మారింది. కొంతకాలంగా డీఎస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన బీపీ లెవెల్స్ పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే.. డీఎస్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారని, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆయనకు ఆస్తమా, కిడ్నీ, బీపీ సమస్యలు కూడా ఉన్నాయని వెల్లడించారు. వయస్సు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయని హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. అయితే సోమవారం మధ్యాహ్నం డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వైద్యులు సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా డీఎస్ అస్వస్థతకు గురవ్వగా.. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి అస్వస్థతకు గురికావడం ఆందోళన కల్గిస్తోంది. డీఎస్ అస్వస్థతకు గురి కావడంపై ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్ చేశారు. తన తండ్రి డీఎస్ అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.