ఓ మహిళ కొంతకాలంగా ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అతని తీరు నచ్చక విడిచిపెట్టి వేరే చోటికి వెళ్లిపోయింది. సీన్లోకి సదరు వ్యక్తి ఫ్రెండ్ ఎంటర్ అయ్యాడు. తన స్నేహితుడు మంచివాడని.. అతణ్ని విడిచిపెట్టొద్దని.. తన ఫ్రెండ్‌తోనే కలిసి ఉండాలని ఆ మహిళను వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులకు గురిచేస్తోంది సాధారణ పౌరుడు అనుకుంటే పొరపాటే. పోలీసు శాఖలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి. ఏకంగా డీఎస్పీయే బెదిరింపులకు దిగడంతో ఏం చేయాలో అర్థంగాక ఆందోళన చెందుతోంది ఆ మహిళ.
డీఎస్పీ తనను వేధిస్తున్నారని సోమవారం ఒంగోలులో జరిగిన స్పందనలో ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సదరు డీఎస్పీతో పాటు తాను సహజీవనం చేసిన అగ్నిమాపక అధికారిపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. తనతో కలిసి ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతాలు తెరిపించాడని, వాటి లావాదేవీలు, ఏటీఎం కార్డులు, చెక్ పుస్తకాలు ఆయన వద్దే ఉన్నాయని పేర్కొన్నారు. ఆ ఇద్దరు అధికారుల బారి నుంచి తనను కాపాడాలని ఆమె అభ్యర్థించారు.
పోలీసు శాఖ కేటాయించిన అధికారిక నంబరుతోనే తనను బెదిరిస్తున్నారని ఆ మహిళ పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ పోలీసు అధికారి వ్యవహారశైలిపై కొందరు లిఖిత పూర్వక ఫిర్యాదులను ఉన్నతాధికారులకు అందజేసినట్లు సమాచారం. పలు చోట్ల భూ వివాదాల్లో తలదూర్చి తన పలుకుబడితో బెదిరిస్తున్నారని.. పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టించి తమ వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే అభియోగాలున్నాయి. చివరకు ఔషధ దుకాణాలను సైతం వసూళ్లకు లక్ష్యంగా ఎంచుకున్నారన్న ఆరోపణలు సరేసరి.