నిజానికి ఏపీలో అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయినా ఏదో ఒక రూపంలో మద్యాన్ని తరలిస్తూనే ఉన్నారు అక్రమార్కులు. ఈ అక్రమ మద్యం వ్యవహారంలో దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నాగవరలక్ష్మి రాజీనామా చేశారు. దుర్గగుడి ఈవో, పాలకమండలి చైర్మన్కు రాజీనామా లేఖ పంపించారు. విచారణ పూర్తయ్యేవరకూ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వరలక్ష్మి లేఖలో తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే నాగవరలక్ష్మి భర్త, డ్రైవర్ అరెస్టయ్యారు.
నిన్న విజయవాడ దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం పట్టుబడిన ఘటన కలకలం రేపింది. జగ్గయ్యపేటకి చెందిన చక్కా వెంకట నాగ వరలక్ష్మి కారులో భారీగా మద్యం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నాగ వరలక్ష్మి కారులో భారీగా మద్యం గుర్తించారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ మద్యాన్ని ఆమె కుమారుడు సూర్యప్రకాష్ అమ్ముతున్నట్టు గుర్తించారు. కోదాడ నుండి తెచ్చి డబుల్ రేట్లకు ఇక్కడ అమ్ముతున్నట్టు చెబుతున్నారు. అయితే ఆమె దానికి మాకు సంబంధం లేదని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.