దసరా ఎఫెక్టుతో బస్సుల్లో ఫుల్ రష్ నెలకొన్నది. విద్యాసంస్థలకు ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించారు.దీంతో నగరాల్లో చదువుతున్న వారంతా సొంతూర్ల బాట పట్టారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇటు ఆర్టీసీ,అటు రైల్వే శాఖలు అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. అయినప్పటికీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు. 50మంది ప్రయాణికులు వెళ్లాల్సిన బస్సులో 100-150 మంది ప్రయాణిస్తున్నారు. బస్సులో ప్లేస్ లేకపోవడంతో కిక్కిరిసి పోతున్నాయి.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలోనే జగిత్యాల-దావన్ పల్లి మార్గంలో ఒకే ఒక్క బస్సు ఉండటంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. సొంతూరికి వెళ్లేందుకు బస్సెక్కిన వారికి ఊపిరి అందడం లేదు. ఒకరిమీద పడుతూ జర్నీ చేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో ఇద్దరు యువతులు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు.వారికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.