భారత్, చైనాల మధ్య తాజాగా నెలకొన్న వివాదాల నేపథ్యంలో దేశమంతటా బ్యాన్ చైనా ఉద్యమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ అంతటా వినిపిస్తోంది. అందుకు అనుగుణంగానే చాలా మంది చైనా వస్తువులు ఏవి, భారత్ వస్తువులు ఏవి.. తెలుసుకుని మరీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అలాంటి వారి కోసం ఈ-కామర్స్ సంస్థలు తమ తమ ప్లాట్‌ఫాంలపై అమ్మే వస్తువులు ఎక్కడ తయారయ్యాయో తెలియజేసేందుకు అంగీకరించాయి.
ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, గ్రోఫర్స్, బిగ్ బాస్కెట్, పెప్పర్ ఫ్రై, 1ఎంజీ, జియో, పేటీఎం, షాప్ క్లూస్, మింత్రాలు ఇకపై తమ ప్లాట్‌ఫాంలలో అమ్మే ఏ వస్తువు అయినా సరే.. అది ఎక్కడ తయారైందో తెలపాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా సంస్థలు బుధవారం డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)తో సమావేశమై నిర్ణయం తీసుకున్నాయి.
ఇక ఇదే విషయమై ఇప్పటికే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ-కామర్స్ కంపెనీలు తప్పనిసరిగా తమ ప్లాట్‌ఫాంలపై అమ్మే వస్తువులు ఎక్కడ తయారయ్యాయో తెలిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. అయితే ఇంతలోనే ఈ-కామర్స్ సంస్థలే ఈ విషయంపై అంగీకారం తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే కస్టమర్లు ప్రస్తుతం చైనా వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని, అందుకనే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఇలా ఆయా ఉత్పత్తుల తయారీ దేశ వివరాలను తమ ప్లాట్‌ఫాంలో తెలిపేందుకు అంగీకరించామని.. ఓ ఈ-కామర్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ విషయం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే.. ఈ-కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంలను కొత్త సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్ చేయాలి. అందుకు కొంత పట్టే అవకాశం ఉంది.