నిత్యావసర వస్తువులను విక్రయించే కిరాణా స్టోర్స్ బిజినెస్ అంటే.. అది ఎవర్‌గ్రీన్ బిజినెస్.. చూడండి.. కరోనా కష్టకాలంలోనూ ఆ వ్యాపారాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగుతున్నాయి. అందుకనే చాలా మంది కిరాణా స్టోర్స్‌ను నిర్వహించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే కొంత పెట్టుబడి ఎక్కువ పెట్టే సామర్థ్యం ఉంటే.. కిరాణా స్టోర్స్ కాదు. సూపర్ మార్కెట్ పెట్టాలి. దీంతో లాభాలు బాగా వస్తాయి. మరి ఇందుకు ఎంత పెట్టుబడి పెట్టాలో.. ఏమేం అవసరం అవుతాయో.. ఈ బిజినెస్‌లో ఎంత సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
సూపర్ మార్కెట్ పెట్టేందుకు విశాలమైన స్థలం ఉన్న షాపు కావాలి. అది జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశంలో అయితే మంచిది. బిజినెస్ బాగా జరుగుతుంది. ఇక ఒక మోస్తరు పట్టణాల్లో అయితే.. సూపర్ మార్కెట్ పెట్టేందుకు షాపులకు రూ.1 లక్ష నుంచి అడ్వాన్సు ప్రారంభమవుతుంది. అలాగే నెల నెలా రూ.వేలల్లో రెంట్ చెల్లించాలి. ఇక స్టోర్‌లో బాస్కెట్లు, బార్ కోడ్ స్కానర్లు, కంప్యూటర్లు, బిల్లింగ్ మెషిన్లు, పీవోఎస్ మెషిన్లు, సామాన్లు ఉంచే ర్యాక్‌లు తదితర సామగ్రికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. అది పోను రూ.3 లక్షలతో కిరాణా సరుకులు కొని సూపర్ మార్కెట్‌లో పెట్టవచ్చు. దీంతో ఎంత లేదన్నా ఈ బిజినెస్‌కు కనీసం రూ.7 లక్షల వరకు అవుతుంది. అదే రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. మరింత పెద్దగా సూపర్ మార్కెట్‌ను పెట్టడంతోపాటు ఎక్కువ సామాన్లను అందులో ఉంచి విక్రయించవచ్చు.
సూపర్ మార్కెట్ పెట్టేందుకు గాను లోకల్ మున్సిపాలిటీ లేదా పంచాయతీ నుంచి పర్మిషన్ ఉండాలి. వ్యక్తిగత లేదా పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్‌గా సూపర్‌మార్కెట్‌ను రిజిస్టర్ చేయించాలి. ట్రేడ్ లైసెన్స్ పొందాలి. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ చేయించాలి. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉండాలి. అలాగే సూపర్ మార్కెట్‌లో పనిచేసే కార్మికులకు గాను లేబర్ ఆఫీస్ నుంచి లేబర్ లైసెన్స్ పొందాలి. ఇక సూపర్ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడయ్యేవి నిత్యావసర సరుకులు కాబట్టి వాటి అమ్మకాలపై దృష్టి సారించాలి. అలాగే సబ్బులు, నూనెలు, పేస్టులు, షాంపూలు వంటి వస్తువులను తయారు చేసే కంపెనీలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లతో టై అప్ అయితే వారు తమ కంపెనీ వస్తువులను నేరుగా సూపర్ మార్కెట్‌కు పంపిస్తారు. దీంతో ఆయా సరుకులను సులభంగా తెచ్చి విక్రయించవచ్చు.
ఇక పప్పులు, కూరగాయలు, పల్లీలు, శనగలు, మినుములు తదితర పదార్థాల కోసం రైతులు, చిన్న పరిశ్రమల వారు, మిల్లుల యజమానులతో టై అప్ అవచ్చు. దీంతో వారి నుంచి ఆయా పదార్థాలు సరఫరా అవుతాయి. వాటిని ప్యాక్ చేసి సూపర్ మార్కెట్‌లో విక్రయించవచ్చు. ఇలా అన్ని రకాల సరుకులు, వస్తువులను తెచ్చి సూపర్ మార్కెట్‌లో పెట్టి అమ్మవచ్చు. అయితే వస్తువులను అమ్మే దాన్ని బట్టి లాభాలు ఉంటాయి.
సాధారణంగా అనేక కంపెనీలు తమ వస్తువులపై 3 శాతం మొదలుకొని 10 శాతం వరకు మార్జిన్ ఇస్తుంటాయి. కనుక సేల్స్ ఎక్కువగా చేస్తే.. ఎక్కువ మార్జిన్ వస్తుంది. దీంతో ఎక్కువ లాభాలు వస్తాయి. కనుక వస్తువులకు సేల్స్ పెంచే ఆలోచన చేయాలి. ఇక పాత కంపెనీలు సహజంగానే తక్కువ మార్జిన్ ఇస్తుంటాయి. కొత్త కంపెనీలు ఎక్కువ మార్జిన్ ఇస్తాయి. ఈ విషయంపై కూడా ఆలోచించి వస్తువులను అమ్మితే మార్జిన్ల ద్వారా ఎక్కువ మొత్తం పొందవచ్చు. అయితే కొన్ని రకాల కంపెనీలు ముందుగా మార్జిన్‌ను తక్కువ ఇచ్చినా.. సేల్స్ ఎక్కువగా చేస్తే.. మార్జిన్‌ను పెంచుతాయి. కనుక అలా కూడా లాభం పొందవచ్చు.
సూపర్ మార్కెట్ బిజినెస్ వేగంగా వృద్ధి చెందాలంటే.. పబ్లిసిటీ బాగా చేయాలి. సూపర్ మార్కెట్ ఉన్న చోటు నుంచి 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో న్యూస్ పేపర్లలో యాడ్లు ఇవ్వాలి. పాంప్లెట్ల ద్వారా పబ్లిసిటీ చేయాలి. దీంతో చాలా మందికి సూపర్ మార్కెట్ గురించి తెలుస్తుంది. ఇక జనాలు కిరాణా స్టోర్స్ కన్నా సూపర్ మార్కెట్లు అంటేనే కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కనుక.. సరుకులను కూడా నాణ్యంగా అందించేలా చూడాలి. అలాగే ధరలను కూడా రీజనబుల్‌గా అందుబాటులో ఉంచాలి. దీంతో కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా రూ.వేలు మొదలుకొని జరిగే బిజినెస్ రూ.లక్షల్లోకి వస్తుంది. ఆ విధంగా సూపర్ మార్కెట్ బిజినెస్ ద్వారా నెల నెలా రూ.లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు..!