ఏ దేశంలో అయినా సరే నిర్మాణ రంగం ఎవర్‌గ్రీన్‌గా కొనసాగుతుంది. గృహ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయా నిర్మాణాలకు సంబంధించి ఇంటీరియర్ డోర్లను తయారు చేసే బిజినెస్ చేయడం వల్ల.. చక్కని ఆదాయం పొందవచ్చు. కొద్దిగా శ్రమించి, పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్నవారు ఈ బిజినెస్‌లో చక్కగా రాణించవచ్చు. మరి ఇందుకు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో.. ఏ మేర ఆదాయం వస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
ఏ నిర్మాణానికి అయినా సరే.. ఇంటీరియర్ (లోపలి వైపు) డోర్లను ఎవరైనా.. తక్కువ ఖరీదు ఉన్నవి ఏర్పాటు చేయిస్తుంటారు. ఇండ్లలో అయితే బాత్‌రూం, కిచెన్, బెడ్‌రూం తదితర గదులకు, వాణిజ్య సముదాయాల్లో లోపలి వైపు గదులకు చాలా తక్కువ ఖరీదు కలిగిన డోర్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇక అవే డోర్లను తయారు చేసి విక్రయించడం ద్వారా చక్కని లాభాలు పొందవచ్చు. ఈ బిజినెస్‌కు గాను షెడ్డు, పలు మెషిన్స్, పరికరాలు అవసరం అవుతాయి. వుడ్ సీజనింగ్ మెషిన్, గ్లూ అప్లికేటర్, వాక్యూమ్ మెంబ్రేన్ ప్రెస్, కటింగ్ టూల్స్, డస్ట్ కలెక్టర్, ఇతర మెకానికల్ టూల్స్ అవసరం అవుతాయి.
ఈ బిజినెస్‌కు గాను ముడిపదార్ధం.. అంటే చెక్క, ఫైబర్, ప్లైవుడ్, పీవీసీ ఫిలిం తదితరాలను సా మిల్స్ నుంచి తెచ్చుకోవాలి. హార్డ్‌వేర్ షాపుల్లోనూ వీటిని విక్రయిస్తారు. ఈ క్రమంలో మొత్తం బిజినెస్‌ను సెట్ చేసుకునేందుకు కనీసం రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈ బిజినెస్‌కు లోకల్ అథారిటీ పర్మిషన్, ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. అలాగే ఎంఎస్ఎంఈ ఉద్యోగ్ ఆధార్ స్కీం కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఈ క్రమంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ బిజినెస్‌కు అయ్యే ఖర్చులో 15 నుంచి 35 శాతం వరకు సబ్సిడీ పొందవచ్చు.
ఇక ఈ బిజినెస్‌లో భాగంగా తయారు చేసే ఇంటీరియర్ రూమ్ డోర్లను ఫ్లష్ లేదా మెంబ్రేన్ డోర్స్ అని పిలుస్తారు. వీటిని కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, హార్డ్‌వేర్ షాపులు.. తదితరులకు అమ్మితే.. 30 నుంచి 40 శాతం వరకు మార్జిన్ లభిస్తుంది. అందుకు గాను ఆయా కంపెనీలు, షాపులతో ఒప్పందాలు చేసుకోవాలి. అలాగే బిజినెస్‌కు మార్కెటింగ్ కూడా బాగా చేయాలి. ఈ క్రమంలో బిజినెస్ వృద్ధి చెంది చక్కని లాభాలు సంపాదించవచ్చు. మీరు చేసే మార్కెటింగ్‌ను బట్టి ఇందులో రూ.వేలు మొదలుకొని రూ.లక్షల్లో లాభాలు సంపాదించవచ్చు..!