కేంద్ర రాష్ట్ర నిర్భందాలు పెరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతుండగా.. మరికొందరూ లొంగుబాటు పడుతున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలు కొసా ప్రొటెక్షన్ గ్రూపు కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయారు.
లొంగుబాటుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఛతీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం, రాసపల్లి గ్రామానికి చెందిన వంజెం కేషా బాల్యం నుంచే చైతన్య నాట్య మండలిలో పని చేయడంతో మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులతో పరిచయాలు కావడంతో 2017లో పామెడ్ లోక్ స్క్వాడ్ కమాండర్ గొట్టే కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరారు. రెండేళ్ల పాటు పున్నెం జోగ ఆధ్వర్యంలో చైతన్య నాట్యమండలిలో పని చేసింది. ఇదే సంవత్సరం కేషాను పార్టీ నాయకత్వం అబుజ్ మడ్ ప్రాంతానికి బదిలీ చేసి కేంద్ర కమిటీ సభ్యుడు కడారీ సత్యనారాయణ రెడ్డికి ప్రోటెక్షన్ గ్రూపు సభ్యురాలుగా నియమించింది.