కొంత డబ్బు పెట్టుబడి పెట్టి.. కొద్దిగా శ్రమించాలే గానీ.. నిరుద్యోగులు, మహిళలు చేసేందుకు అనేక స్వయం ఉపాధి మార్గలు ఉన్నాయి. వాటిల్లో అక్రిలిక్ బటన్ (గుండీలు) మేకింగ్ బిజినెస్ కూడా ఒకటి. ప్రస్తుత తరుణంలో గార్మెంట్స్ వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో.. దుస్తులకు ఉండే బటన్స్‌ను తయారు చేసే బిజినెస్ పెడితే పెద్ద ఎత్తున లాభాలను ఆర్జించవచ్చు. ఈ క్రమంలో ఈ బిజినెస్‌కు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో.. దీని వల్ల ఎంత వరకు ఆదాయం వస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందాం.
అక్రిలిక్ బటన్ మేకింగ్ బిజినెస్‌ను స్థలం ఉంటే ఇండ్లలో పెట్టుకోవచ్చు. లేదంటే షెడ్లలో పెట్టవచ్చు. అందుకు గాను లోకల్ అథారిటీ పర్మిషన్, జీఎస్‌టీ నంబర్ రిజిస్ట్రేషన్, ట్రేడ్ లైసెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్‌వోసీ తదితర పత్రాలు అవసరం అవుతాయి. ఇక ఈ బిజినెస్‌కు గాను పలు రకాల మెషిన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అక్రిలిక్ షీట్ కటింగ్ మెషిన్, డ్రిల్లింగ్ మెషిన్, బటన్ ఎడ్జ్ గ్రైండింగ్ మెషిన్, బటన్ హోల్ మేకర్ తదితర మెషిన్లను కొనుగోలు చేయాలి. వీటిల్లో మాన్యువల్, ఆటోమేటిక్ మెషిన్లు ఉంటాయి. ఆటోమేటిక్ మెషిన్ల ద్వారా పని వేగవంతం అవుతుంది. అలాగే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది.
ఈ బిజినెస్‌కు సుమారుగా రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 200 నుంచి 300 ఎస్ఎఫ్టీ స్థలం అవసరం అవుతుంది. ఇద్దరు లేదా ముగ్గురు పనివారిని అరేంజ్ చేసుకోవాలి. ఇక అక్రిలిక్ షీట్లు, ప్యాకింగ్ మెటీరియల్ వంటి రా మెటీరియల్ అవసరం ఉంటుంది. అయితే పలు రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్కీంల ద్వారా ఈ బిజినెస్‌కు అయ్యే మొత్తంలోంచి కొంత వరకు సబ్సిడీని పొందవచ్చు.
ఇక అక్రిలిక్ బటన్లను తయారు చేసేందుకు ముందుగా షీట్లను బటన్ షేప్‌లో మనకు కావల్సిన విధంగా కట్ చేసుకోవాలి. కావల్సిన డిజైన్, కలర్ ఉన్న షీట్లను ఎంచుకుని వాటిని బటన్లుగా కట్ చేసి వాటిని ఆయా మెషిన్ల సహాయంతో చక్కని షేప్‌లో మలుచుకోవాలి. ఆ తరువాత ఆ బటన్లను ప్యాక్ చేసి సప్లయి చేయాలి. దుస్తుల తయారీ పరిశ్రమలు, టైలర్స్, కంగన్ హాల్స్, దుస్తులకు సంబంధించిన ఐటమ్స్ అమ్మేవారు తదితరులతో కాంటాక్ట్‌లో ఉంటూ బటన్లను విక్రయించాలి. అందుకుగాను మార్కెటింగ్ చేయాలి. దీంతో ఈ బిజినెస్ చాలా సులభంగా చేయవచ్చు.
అక్రిలిక్ బటన్ మేకింగ్ బిజినెస్‌లో రూ.1 లక్ష వరకు బిజినెస్ చేస్తే (విక్రయాలు జరిపితే) 70 శాతం వరకు అంటే.. రూ.70వేల వరకు మార్జిన్ వస్తుంది. నెలకు రూ.1 లక్ష వరకు బిజినెస్ చేయగలిగితే.. నెలకు రూ.70వేలను సంపాదించవచ్చు. అయితే అందుకు గాను మార్కెటింగ్ బాగా చేయాల్సి ఉంటుంది. షర్టులు, టీ షర్టులు, ఇతర గార్మెంట్లకు బటన్లు తప్పకుండా అవసరం అవుతాయి.. కనుక ఆయా రంగాలకు చెందిన వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా.. ఈ బిజినెస్‌లో చక్కగా రాణించవచ్చు. దాంతో అనతికాలంలోనే ఈ వ్యాపారంలో ఎక్కువ లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది..!