భూమిని సంరక్షించే పొరలో పగుళ్లు వచ్చాయని, ఆ పొర రెండుగా చీలిపోతుందని, అందువల్ల భూ అయస్కాంత క్షేత్రం బలహీన పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తెలిపింది. దక్షిణ అమెరికా, దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రంల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేసింది. దీన్నే నాసా సౌత్ అట్లాంటిక్ అనామలీ (ఎస్ఏఏ)గా వ్యవహరిస్తోంది.
ఎస్ఏఏ వల్ల భూ అయస్కాంత క్షేత్రం బలహీన పడుతుందని నాసా తెలిపింది. దీని వల్ల సౌర పదార్థాలు, కణాలు భూమి వైపు గతంలో కన్నా ఎక్కువగా ఆకర్షితమవుతాయని తెలియజేసింది. అయితే ఇది భవిష్యత్తులో శాటిలైట్ మిషన్లకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుందని సైంటిస్టులు తెలిపారు. దీని వల్ల శాటిలైట్లు సరిగ్గా పనిచేయకపోవచ్చని తెలిపారు.
అయితే గతంలోనూ సైంటిస్టులు సరిగ్గా ఇలాంటి ప్రక్రియనే గుర్తించారు. అది ఆర్కిటిక్ వలయం మీదుగా ఏర్పడింది. దాని వల్ల సగటున 200 ఏళ్లకు భూ అయస్కాంత క్షేత్రం ప్రభావం 9 శాతం మేర బలహీనపడుతుందని అప్పట్లో గుర్తించారు. అయితే ఇప్పుడు ఎస్ఏఏ వల్ల భూ అయస్కాంత క్షేత్రం మరింత బలహీనపడుతుందని, 1970 నుంచి మరో 8 శాతం ఎక్కువగా ఆ క్షేత్రం ప్రభావం బలహీనపడుతూ వస్తుందని తెలిపారు.
అయితే దీనివల్ల భవిష్యత్తులో కొత్త శాటిలైట్లను లాంచ్ చేయడం ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎస్ఏఏ మీదుగా ప్రయాణించే శాటిలైట్లు సూర్యుడి ప్రోటాన్ శక్తి వల్ల పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అందువల్ల శాటిలైట్ల సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే దీనిపై నాసా, ఈఎస్ఏ సైంటిస్టులు ప్రస్తుతం మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.