దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత విచారణ సమయంలో పది మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులకు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ అధికారులు మంగళవారం రోజున కవిత సెల్‌ఫోన్ల నుంచి డేటా సేకరించారు. అంతకుముందే దీనిపై కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. ఫోన్లను తెరుస్తున్నామని.. తెరిచే సమయానికి కవిత లేక ఆమె ప్రతినిధి హాజరుకావాలని కోరింది.
దీంతో కవిత తరఫున బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ మంగళవారం దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఉదయం 11.30కు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. డేటా సేకరణ, సోమ భరత్ నుంచి కొంత సమాచారం సేకరించిన తర్వాత ఈడీ అధికారులు ఆయనను పంపించేశారు. సెల్ ఫోన్లు తెరిచే సమయంలో తాను ఉన్నానని, ఈడీ కార్యాలయంలో జరిగిన అంశాలను మీడియాకు తెలపలేనని భరత్ చెప్పారు.