ఎడిట్ నోట్: ఆనం పక్కా ప్లాన్.!

-

వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి కోరుకున్నదే జరిగిందా..వైసీపీని వీడటానికి జగన్ చేత బయటకు పంపించేలా చేసుకున్నారా? అంటే ప్రస్తుతం ఆనం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం బట్టి చూస్తే అదే నిజమనిస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారమే వైసీపీ నుంచి బయటకెళ్లెలా ఆనం చేసుకున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆనం..వెంకటగిరి నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. సీనియర్ కావడంతో మంత్రి పదవి ఆశించారు. కానీ పదవి రాలేదు.

ఈ అసంతృప్తితో పలు సందర్భాల్లో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ వచ్చారు. అధికారుల తీరుని తప్పుబడుతూ వచ్చారు. ఇటీవల అయితే..నాలుగేళ్లలో ఏం చేయలేకపోయామని, రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కొత్త ప్రాజెక్టులు తీసుకు రాలేదని, కనీసం ఇళ్ళు కట్టలేకపోయామని..ఇంకా ఏమని ప్రజలని ఓట్లు అడుగుతామని ఆనం ప్రశ్నించారు. పెన్షన్లు ఇస్తే ఓట్లు వేసేస్తారా..గత టీడీపీ ప్రభుత్వం సైతం భారీగా పెన్షన్లని పెంచిందని, అయినా సరే ఓడిపోయిందని గుర్తు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై జగన్ సీరియస్ అయ్యారని తెలిసింది..కానీ అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మాత్రం ముందస్తు ఎన్నికలు అంటున్నారని..ముందస్తుకు వెళితే ముందుగానే ఇంటికి వెళ్లిపోవడం గ్యారెంటీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఓటమి అంటూ మాట్లాడటంపై జగన్ సీరియస్ అయ్యారని తెలిసింది. అందుకే వెంటనే..ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి స్థానానికి ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు.

అయితే ఎప్పటినుంచో ఈ సీటుని నేదురుమల్లికి ఇస్తారని, ఆనంని సైడ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆనం సైతం నెల్లూరు సిటీ సీటు కోసం చూస్తున్నారని తెలుస్తోంది. కానీ అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. కాబట్టి ఆ సీటు దక్కే ఛాన్స్ లేదు. ఇక ఈయన టీడీపీలోకి వెళ్తారని ప్రచారం ఉంది. కాకపోతే జగన్ చేతే బయటకు పంపించేసేలా ఆనం చేసుకున్నారని అంటున్నారు.

అంతా ఆనంకు జగన్ చెక్ పెట్టారని అనుకుంటున్నారని, కానీ ఆనం తెలివి జగన్ చేతే..వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయేలా ఆనం చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వైసీపీలో ఆనం రాజకీయానికి ఫుల్ స్టాప్ పడిందని, ఇంకా ఆయన టీడీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఆనం రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version