‘హలో ఏపీ…బై బై వైసీపీ’ ఇది జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త నినాదం..వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడానికి పోరాడుతున్న పవన్..వారాహి యాత్రతో ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్..పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఫైర్ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిందని, గంజాయి, కల్తీ మద్యం, అక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక, ఇళ్ల స్థలాల్లో అవినీతి..అప్పులు చేసి అదే అభివృద్ధి అంటున్నారని, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలని పవన్ కోరుతున్నారు.
అలాగే తనకు సిఎంగా అవకాశం ఇవ్వాలని, జనసేన ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చి దిద్దుతానని పవన్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమలాపురం సభలో హలో ఏపీ..బై బై వైసీపీ అనే నినాదం అందుకున్నారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి అంటూ నినదించారు. ఈ నినాదాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని జనసేన శ్రేణులని పవన్ పిలుపునిచ్చారు. దీంతో జనసేన శ్రేణులు పవన్ స్లోగన్లని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
అయితే ఈ స్లోగన్లు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తాయనేది చూడాలి. గతంలో వైసీపీ..బై బై బాబు అనే నినాదం పెట్టుకున్నారు. దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. ఇక టిడిపి సైతం..జగన్ టార్గెట్ గా సైకో పోవాలి..సైకిల్ రావాలి అంటూ నినాదం పెట్టుకుంది. దీనిపై పాట కూడా పెట్టింది.
ఇప్పుడు పవన్ హలో ఏపీ…బై బై వైసీపీ అనే నినాదం పెట్టుకున్నారు. ఈ నినాదాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తాయి..జగన్‌కు ఎంతవరకు నెగిటివ్ అవుతుందనేది చూడాలి. ఇక టిడిపి, జనసేన కలిస్తేనే ఈ నినాదాలు కూడా కాస్త వర్కౌట్ అవుతాయని చెప్పవచ్చు. అటు వైసీపీ ఏమో మరో 30 ఏళ్ల పాటు జగనే సిఎం అంటున్నారు. మరి ఈ పరిస్తితుల్లో ఎవరి వైపుకు ప్రజలు వస్తారనేది చూడాలి.