ఎడిట్ నోట్: రేవంత్ పాద’యాత్ర’.!

-

మొత్తానికి తెలంగాణ పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా పాదయాత్ర మొదలుపెట్టారు. ఎప్పటినుంచో పాదయాత్ర చేయాలని రేవంత్ చూస్తున్న విషయం తెలిసిందే. గతంలో వైఎస్సార్ మాదిరిగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ లో ఉండే అంతర్గత విభేదాలు వల్ల పాదయాత్ర చేయడం సాధ్యపడలేదు. పాదయాత్ర చేస్తే కేవలం రేవంత్ ఇమేజ్ మాత్రమే పెరుగుతుందని చెప్పి కొందరు సీనియర్లు అడ్డుపెడుతూనే వచ్చారు.

దీంతో పాదయాత్ర పెండింగ్ లో పడుతూ వచ్చింది. పైగా పార్టీలో విభేదాలు ముదిరిపోయాయి. కానీ తాజాగా రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే..పార్టీలో పరిస్తితులని చక్కదిద్దే కార్యక్రమం చేశారు. దీంతో నేతలు కలిసినట్లే కనిపించారు. పైగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా..రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు హత్ సే హత్ పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణలో సైతం కాంగ్రెస్ నేతలు పాదయాత్రకు సిద్ధమయ్యారు.

 

సీనియర్ నేతలు ఎవరికి వారు పాదయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. ఇదే క్రమంలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే 2 నెలల పాటు రేవంత్ పాదయాత్ర కొనసాగనుంది. ఆ తర్వాత పాదయాత్ర ఉంటుందా? లేదా? అనేది పరిస్తితులు బట్టి ఉంటుంది. కాకపోతే రేవంత్ పాదయాత్రపై కొందరు సీనియర్లు అడ్డంకులు పెడుతున్నారు. కేవలం తన అనుచర నేతలు, క్యాడర్ ఉన్న స్థానాల్లోనే రేవంత్ పాదయాత్ర ఉందని, దీని రేవంత్ ఒక్కడి ఇమేజ్ పెరుగుతుందని, కాబట్టి పాదయాత్రలో అందరూ నేతలు పాల్గొనేలా చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

దీనిపై మాణిక్ రావు స్పందిస్తూ..నేతలు తమకు నచ్చిన విధంగా కలిసొచ్చే స్థానాల్లో పాదయాత్ర చేయవచ్చు అని, అందరూ ఒకచోట పాదయాత్ర చేయడానికి లేదని చెప్పుకొచ్చారు. దీంతో రేవంత్ పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్లనుంది. అయితే రేవంత్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది..పార్టీ మైలేజ్ ఎంతవరకు పెంచుతుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version