తెలంగాణలో ఇప్పుడు హుజూరాబాద్ ఎంత హాట్ టాపిక్‌గా ఉందో అందరికీ తెలిసిందే. ఏ పార్టీ అయినా ఇప్పుడు హుజూరాబాద్‌ను దృష్టిలో పెట్టుకునే రాజకీయాలు చేస్తోంది. కాకపోతే ఇందులో టీఆర్ఎస్ మాత్రం ఒకింత దూకుడుమీద ఉంది. వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని మండలాలను చుట్టేస్తూ పింఛన్లు, రేషన్‌కార్డులు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేస్తున్నారు.
ఇక ఈ రాజకీయాలపై ఈటల రాజేందర్ నిన్న జరిగిన సభలో హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు చేస్తున్న రాజకీయాలపై ఆయన కొన్ని సవాళ్లు విసిరారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తనను ఓడించేందుకు టీఆర్ఎస్ మంత్రులు నియోజకవర్గంలో తిరిగి రేషన్‌కార్డులు, పింఛన్లతో పాటు రోడ్లు, ఇతర అభివృద్ధి విషయాల్లో హామీలు ఇస్తూ మంజూరు చేస్తున్నారని, అసలు వారెప్పుడైనా వారి నియోజకవర్గాల్లో ఇవి చేశారా అంటూ మండిపడ్డారు. సీఎం పర్మిషన్ లేకుండా ఒక్క పింఛన్ లేదా రేషన్‌కార్డు ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు. వారెవ్వరికీ స్వతంత్రం లేదని, కాకపోతే ఇక్కడ ఎలక్షన్లు రావడంతో ఇలా స్వతంత్రం వచ్చిందని ఎద్దేవా చేశారు. అయితే ఈటల చేసిన సవాల్ గట్టిగానే మంత్రులకు తగిలినట్టుంది. కాబట్టి వీటికి సమాధానం చెప్పడం కష్టమే అనిపిస్తోంది.