హైదరాబాద్ మహానగరాన్ని ఎనిమిది ఆరోగ్య జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించి 8 మంది డీఎంహెచ్‌వోలను నియమించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ప్రాథమిక ఆరోగ్యసేవలు అంత పటిష్ఠంగా లేవని అభిప్రాయపడ్డారు. ఆదివారం అమీర్‌పేటలో ఒక సంస్థ నిర్వహించిన ఆరోగ్య సదస్సు, అవార్డుల కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎనిమిది ఆరోగ్య జిల్లాలుగా పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు హరీశ్ రావు అన్నారు. ప్రతి పౌరుడిని పరీక్షించి రక్తపోటు, మధుమేహ సమస్యలను గుర్తించడంతోపాటు జీవనశైలి, ఆహారం, ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని, ఎంబీబీఎస్ వైద్యులు లేనిచోట ఆయుర్వేద వైద్యులను నియమిస్తున్నామని తెలిపారు.
ప్రైవేటు ఆయుర్వేద కళాశాలలకు అనుమతులివ్వడానికి సిద్ధంగా ఉన్నామని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తామని.. ఈ ఏడాది 17 కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నామని చెప్పారు. వరంగల్‌లో 2000 పడకలతో త్వరలో హెల్త్ సిటీ కూడా అందుబాటులోకి రానుందన్నారు.