ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా హైదారాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు మహిళల అక్రమ రవాణా ఏదో ఒకరకంగా కొనసాగుతూనే ఉంది. గత అక్టోబర్‌లో మధ్యవర్తి మాయమాటలు నమ్మి తన కూతురును ఒమన్‌కు పంపించిన ఓ తల్లి.. అక్కడ కూతరు అనుభవిస్తున్న నరకయాతన చూసి తల్లడిల్లుతున్నది. దేశంకాని దేశంలో ఇబ్బందులు పడుతున్న తన కూతురును క్షేమంగా ఇంటికి చేర్చండంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయానికి మొరపెట్టుకుంటున్నది.
గత ఏడాది అక్టోబర్‌లో ఫలక్‌నుమా నివాసి అయిన నుస్రత్ బేగం అనే యువతిని ఒమన్‌లో బ్యుటీషియన్ ఉద్యోగం ఉందంటూ ఓ మధ్యవర్తి అక్కడికి పంపించాడు. తీరా అక్కడికి వెళ్లాక బ్యుటీషియన్ ఉద్యోగం దొరకకపోవడంతో ఇళ్లలో పనిమనిషిగా చేర్చాడు. అయితే ఆ ఇంటి యజమాని నుస్రత్‌ను చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఇప్పుడు స్వదేశానికి తిరిగి రావడానికి బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నది.
ఆ బిడ్డ పరస్థితి చూసి ఇక్కడ ఓ తల్లి ప్రాణం కొట్టుకుంటుంది. ‘నా బిడ్డకు ఒమన్ దేశంలోని మస్కట్ నగరంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ 5 నెలల క్రితం ఓ మధ్యవర్తి మా ఇంటికి వచ్చాడు. ఖర్చులు, కమిషన్ పేరుతో 2 లక్షల రూపాయలు తీసుకుని మా బిడ్డను మస్కట్‌కు పంపించాడు. అయితే అక్కడ బ్యుటీషియన్ ఉద్యోగం కాకుండా ఇళ్లలో పనికి కుదిర్చాడు. అయితే ఇంటి యజమాని అసభ్యప్రవర్తన, చిత్రహింసలు తట్టుకోలేక నా బిడ్డ అక్కడి నుంచి తప్పించుకుని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. తనను ఎలాగైనా నా దగ్గరికి చేర్చండి’ అని సుస్రత్ తల్లి బీబీ ఫాతిమా వేడుకుంటున్నది.