ఈపీఎఫ్ ఉద్యోగులకు తీపి కబురు. ఇక మీదట ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఇచ్చే పరిహారాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ లో ఉన్న 30 వేల మంది ఉద్యోగులకు వర్తించనుంది. తాజాగా ఈపీఎఫ్ తీసుకున్న నిర్ణయం వెంటనే అమలులోకి రానుంది. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ ను ఈపీఎఫ్ తన అన్ని ఆఫీసులకు పంపింది. అయితే కోవిడ్ వల్ల మరణించిన వారిని ఇందులో చేర్చలేదు. ప్రస్తుతం ప్రమాదంలో మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన వారికి, నామినీకి రెట్టింపు పరిహారం లభించనుంది. ఈ నిర్ణయం వల్ల వారికి రూ.8 లక్షల దాకా అందనున్నాయి. 2006లో ఈ పరిహరం కేవలం రూ.5 వేల మాత్రమే ఉండగా దాన్ని రూ. 50 వేలకు ఆతరువాత రూ. 4.2 లక్షలకు పెంచారు. తాజాగా దీన్ని డబుల్ చేశారు. ఈ పరిహారాన్ని ప్రతీ మూడేళ్లకు ఒకసారి 10 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో సభ్యులు దీన్ని కనిష్టంగా రూ. 10 లక్షలు, గరిష్టంగా రూ. 20 లక్షలు ఉండాలని డిమాండ్ చేశారు. కరోనా మరణం కాకుండా ఇతర ప్రమాదాల వల్ల సభ్యుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ. 8 లక్షలు అందనున్నాయి.
కరోనాతో మరణిస్తే ఎలా..?
ఒకవేళ ఉద్యోగి కరోనాతో మరణిస్తే అతనిపై ఆధారపడిన కుటుంబానికి కోవిడ్-19 ఉపశమన పథకం కింద ప్రతి నెలా ఆర్థిక సహాయం అందించబడుతుంది. దీని కింద, బీమా చేసిన వ్యక్తి సగటు రోజువారీ వేతనం నుంచి 90 శాతం ప్రతినెలా డిపెండెంట్లకు ఇవ్వబడుతుంది. ఈ ప్రయోజనం మరణించిన వ్యక్తి యొక్క భార్యకు జీవితాంతం లేదా రెండవ వివాహం వరకు, కొడుకుకు 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మరియు కుమార్తెకు ఆమె వివాహం అయ్యే వరకు ఇలా ఇవ్వబడుతుంది. దీని ద్వారా కనీస ఉపశమనం కింద నెలకు కనిష్టంగా రూ. 1,800. అందుతాయి.