ఓరుగ‌ల్లు గులాబీలో ఎర్ర‌బెల్లి క‌ల‌క‌లం..!

-

ఓరుగ‌ల్లు గులాబీ కోట‌లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు క‌ల‌క‌లం రేపుతున్నారా..?  రోజురోజుకూ పెరిగిపోతున్నా ఆయ‌న పెత్త‌నంపై లోలోప‌ల గులాబీశ్రేణులు ఉడికిపోతున్నారా..?  మొద‌టి నుంచీ గులాబీ జెండాను ఎత్తుకున్న నేత‌లు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారా..? ఉద్య‌మ‌ మ‌ధ్య‌లో అంత‌క‌న్నా కాదు.. క‌నీసం కొస‌కు కూడా కాదు.. క‌ష్ట‌ప‌డి తెచ్చిన రాష్ట్రంలో ఇప్పుడొచ్చి పెత్త‌నం చేయ‌డం ఏమిట‌నే భావ‌న గులాబీ శ్రేణుల్లో పెరుగుతోందా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. నిజానికి.. ఉద్య‌మ స‌మ‌యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్ర‌బెల్లి ఎమ‌న్నారో.. అదే స‌మ‌యంలో కేసీఆర్ కూడా ఎర్ర‌బెల్లికి ఎలాంటి వాత‌లు గుంజారో తెలంగాణ‌వాదులంద‌రికీ తెలిసిందే..


టీడీపీ సీనియ‌ర్ నేత‌గా.. ప్ర‌జాదర‌ణ‌లో తిరుగులేని నాయ‌కుడిగా ఎర్ర‌బెల్లికి మంచి గుర్తింపు ఉంది. వ‌రుస విజ‌యాల‌తో రాజ‌కీయాల్లో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. 2014 ఎన్నిక‌ల్లోనూ ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి నుంచి టీఆర్ఎస్ గాలిని త‌ట్టుకుని విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న అధికార టీఆర్ఎస్‌లో చేరారు. ఇక త‌ర్వాత 2019 ఎన్నిక‌ల వ‌ర‌కూ ఎన్న‌డు కూడా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్నారు.

ఇలా 2014 ఎన్నిక‌ల్లో క‌ష్టాతి క‌ష్టంగా గెలిచిన ఎర్ర‌బెల్లి 2019 ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాదు.. ఏకంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేబినెట్లో మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుల్లో ఎర్ర‌బెల్లి ఒక‌రు కావ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి కేబినెట్‌లో స్థానం ద‌క్కించుకున్న ఒకేఒక్క‌డు ఎర్ర‌బెల్లి. పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎర్ర‌బెల్లి ఇప్పుడు ఉమ్మ‌డి జిల్లాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. ఎక్క‌డ ఏ కార్య‌క్ర‌మం జరిగినా ఆయ‌న హాజ‌రుకావాల్సిందే. ఇక్క‌డే అస‌లు తిప్ప‌లు మొద‌లైంది.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత‌లు ఇప్పుడు ఎర్ర‌బెల్లి చెప్పిన‌ట్టు వినాల్సి వ‌స్తోంద‌ని, ఎర్ర‌బెల్లిని కాద‌ని ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని గులాబీ శ్రేణుల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. మొన్న‌టికి మొన్న ఆరోగ్య‌శాఖ మంత్రిని కాద‌ని ఎంజీఎం ద‌వాఖాన‌ను ఎర్ర‌బెల్లి త‌నీఖ చేయ‌డంపైనా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక ప‌లువురు ఎమ్మెల్యేలు, నేత‌లైతే.. లోలోప‌ల ఉడికిపోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏదో ఒక‌రోజు.. ఎవ‌రో ఒక‌రు నోరు తెర‌వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంద‌ని గులాబీ శ్రేణులు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version