ఎస్టీల్లో వ‌ర్గీక‌ర‌ణ చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ కుట్రప‌న్నుతోంది : మంత్రి ఎర్రబెల్లి

-

పాల‌కుర్తి మండ‌లంలోని హ‌ట్యాతండా, భీక్యా నాయ‌క్ పెద్ద తండా, టిఎస్ కె తండా, పెద్ద తండాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలనలోనే దేశం స‌ర్వనాశ‌నం అయిందని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఆరోపించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా అయిననాటి నుంచి తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజ‌లు సంతోషాల‌తో ఉన్నారని, అనేక సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల అమ‌లుతో ప్రజ‌ల జీవ‌న ప్రమాణాలు పెరిగాయని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు చేపడుతున్న కార్యక్రమాలతో భూములకు విలువ‌లు వ‌చ్చాయని, రైతులు బాగుప‌డ్డారని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. అభివృద్ధి నిరోధకులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు గ్రామాలకు వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు.

అన్నద‌మ్ముల్లా క‌లిసి ఉన్న ఎస్టీల్లో వ‌ర్గీక‌ర‌ణ చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ కుట్రప‌న్నుతోందని విమర్శించారు. 24 గంట‌ల క‌రెంటు కావాలా? 3 గంట‌ల క‌రెంటు కావాలా? మూడు పంట‌లకు నీరందించే బీఆర్‌ఎస్‌ పాలన కావాలో ప్రజ‌లు తేల్చుకునే సమయం ఆసన్నమయ్యిందని పేర్కొన్నారు. గ్రామాల‌కు దీటుగా తండాల‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తండాల‌ను గ్రామ పంచాయ‌తీలుగా చేయ‌డ‌మేగాక‌, ఒక్కో తండాకు కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి చేసిన‌ట్లు వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version