వాక్సిన్ వస్తే అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు సిద్దం చేశామని తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ చర్యల వల్ల కరోనా అదుపులో ఉందన్నారు ఆయన. కరోనా వైరస్ పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఈటల సమీక్ష నిర్వహించారు. అమెరికా, యూరప్ దేశాలలో కేసులు పెరుగుతున్న తీరు, భారత దేశంలో ఢిల్లీ, కేరళలో కేసులు పెరుగుతున్న తీరుపై చర్చ జరిగింది.
ఈ సారి వర్షాలు ఎక్కువగా పడటం వల్ల తెలంగాణ లో భూగర్భ జలాలు పెరగడం వల్ల చలి తీవ్రత అంతగా ఉండకపోవచ్చని అంచనా వేశారు అధికారులు. వైరస్ ఉదృతి కూడా ఎక్కువగా ఉండకపోవచ్చని చెబుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి తాము వైరస్ బారిన పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఇతరులను కూడా వైరస్ బారినపడకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఇతర దేశాలలో కేసులు పెరుగుతున్న నేపద్యంలో మన రాష్టంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నామని ఆయన్ అన్నారు.