తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఉండటానికి బిజేపి ఎమ్మెల్యేలు ముగ్గురే ఉన్నా సరే తమదైన శైలిలో బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అటు కాంగ్రెస్ సైతం..ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే..మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మొదట బిజేపి ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో రూమ్ కేటాయించకపోవడంపై ఈటల..ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అసెంబ్లీలో టిఫిన్ చేయడానికి కూడా తమకు రూం లేదని, రూం కూడా కేటాయించకపోవడం ఎమ్మెల్యేలను అవమానించడమే అని, తాము కార్లలో కూర్చుంటున్నామని అన్నారు. కనీసం యూరినల్స్‌కు వెళ్లేందుకు కూడా మాకు వెసులుబాటు లేదని, ఇంత అవమానమా?. ఈ విషయంపై స్పీకర్‌ను అర డజను సార్లు కలిశామని చెప్పుకొచ్చారు.
అలాగే బీజేపీ సభ్యులను బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌కు కూడా పిలవడం లేదని అన్నారు. దీనికి హరీష్ కౌంటర్ ఇస్తూ..ఐదుగురు సభ్యులు ఉంటేనే రూమ్ ఇస్తారని, ఆ విషయం సీనియర్ సభ్యులైన ఈటలకు తెలియదని కౌంటర్ ఇచ్చారు. ఇక బడ్జెట్ అంశంపై కూడా ఈటల..ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా దళితబంధు విషయంలో కేసిఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. దళితబంధు అమలకు సిఎం 2 లక్షల కోట్లు కావాలని అన్నారని, కానీ బడ్జెట్ లో 17 వేల కోట్లు కేటాయించారని, ఈ లెక్కన పథకాన్ని ఎప్పటిలోగా అమలు చేస్తారని ఫైర్ అయ్యారు.
అటు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం.. రూ.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకయ్యాయో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెఘా కృష్ణారెడ్డి, మై హోం రామేశ్వర్ రావు, బండి పార్థసారధి తదితరుల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదని, గల్లీకో బెల్ట్ షాపు పెట్టి రాష్ట్రాన్ని మత్తులో ముంచారని భట్టి ఆరోపించారు. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి.