ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు తుది ఉత్తర్వులు వెల్లడించనుంది. అయితే ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. రెండు కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లను కవిత దాఖలు చేశారు. ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత జ్యుడీషియల్ కస్టడలో ఉన్నారు. అయితే బెయిల్ పిటిషన్ సందర్భంగా కవిత కోర్టు దృష్టికి పలు కీలక విషయాలను తీసుకెళ్లారు. పార్టీ స్టార్ క్యాపెంయినర్గా ఉన్నందున ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని తెలిపింది. మహిళా నేతగా పీఎంఎల్ఎ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హత ఉందని కవిత తెలిపారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను అరెస్ట్ కవిత పేర్కొన్నారు.
ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని కవిత కోర్టులో తెలిపారు. అరెస్ట్ కి సరైన కారణాలు లేవని కవిత వాదనలు వినిపించారు. అయితే ఈడీ, సీబీఐ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోరాయి. దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపాయి. మద్యం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ తెలిపింది. మద్యం కేసులో సూత్రధారి, కీలక పాత్రధారి కవిత అని ఈడీ సైతం తెలిపింది. గత వారం సీబీఐ కేసులో తుది ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా.. ఈడీ కేసుతో కలిపి తుది ఉత్తర్వులు వెలువరిస్తామని జడ్జి తెలిపారు. కాగా, నేడు మధ్యాహ్నం 12 గంటలకు కవిత బెయిల్ పిటిషన్లపై తుది ఉత్తర్వులు వెలువడనున్నాయి. తుది ఉత్తర్వులను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు వెలువరించనుంది.