ప్రజా భవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రాహిల్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చెంచల్ గూడ జైలులో ఉన్న రాహిల్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల చొప్పున రెండు షూరిటీలు ఇవ్వాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో రాహిల్‌ను మరింత విచారణ చేసేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను పాటించాలని సూచించింది.
కాగా, ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే యాక్సిడెంట్ తర్వాత అతడు దుబాయ్ పారిపోగా.. హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం అతడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా చెంచల్ గూడ జైలులో ఉన్నా రాహిల్ కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు రానున్నారు.