కమలం గూటికి‌ చేరువై ఆ మాజీ మంత్రి ఎందుకు సైలెంట్ అయ్యారు ?

-

కాంగ్రెస్‌ పార్టీలో కేంద్రమత్రిగా పని చేసిన సీనియర్‌ నేత.ఇప్పుడు ఎందుకో సైలెంట్‌ అయ్యారు. ఈమధ్య కాలంలో కమలంపార్టీతో సంప్రదింపులు జరిపి మళ్లీ మౌనాన్ని ఆశ్రయించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని గతంలో ప్రకటించిన నాయకుడు సర్వే సత్యనారాయణ. కాంగ్రెస్‌లో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉండేది. ఈ మధ్య ఎందుకో పెద్దగా యాక్టివ్‌గా లేరు. మధ్య జరిగిన ఏ ఎన్నికల్లోనూ కనిపించలేదు. ప్రచారంలో సర్వే మాటే లేదు. మధ్యలో ఆయన కండువా మార్చేస్తున్నారని చర్చ జరిగింది. మళ్లీ సైలెంట్ అయ్యారు ఈ మాజీ కేంద్రమంత్రి.

గ్రేటర్ ఎన్నికల సమయంలో సర్వేతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులు సమావేశమయ్యారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయినా.. ఆలోచిస్తాను అని చెప్పి దాటవేశారు. కాకపోతే లోకల్‌ లీడర్లతోపాటు సెంట్రల్‌ బీజేపీ లీడర్స్‌ తనతో టచ్‌లో ఉన్నారని.. కొన్ని ముఖ్యమైన అంశాలపై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నట్టు కమలానికి పాజిటివ్‌ సిగ్నల్స్‌ ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌లో కొనసాగలేక.. బీజేపీలో చేరే విషయంలో క్లారిటీ రాక అక్కడే ఆగిపోయినట్టు చెవులు కొరుక్కుంటున్నారు.

సర్వే సత్యనారాయణ గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా, రెండుసార్లు మల్కాజ్‌గిరి ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. కంటోన్మెంట్‌ బోర్డు సమావేశాలను కనుసైగలతో శాసించేవారు. అలాంటి సర్వే.. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలవలేదు. కాంగ్రెస్‌లో రాజకీయాలు కుళ్లూ కుతంత్రాలతో నిండిపోయాయని చెబుతూ పార్టీ వైపు వెళ్లడం మానేశారట. అలా అయితే కాషాయ కండువా కప్పేసుకోవచ్చు కదా అంటే.. ఏ నిర్ణయం తీసుకోరు. కాంగ్రెస్‌లో పెద్ద పదవులు అనుభవించిన తరుణంలో.. బీజేపీలో కూడా ఆ స్థాయిలో పదవి ఇస్తే బాగుండు అని అనుకుంటున్నారట సర్వే.

ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతలతో కలిసి వెళ్లి ఓటు వేసి వచ్చారు. ఆనాడు ఆయన్ని అనుసరించిన బీజేపీ నేతల్లో ఒకరు ఆయన ప్రియ శిష్యుడు..ఇంకొకరు కార్పొరేటర్‌. ఇవన్నీ చూసిన వారు ఆయన అడుగులు బీజేపీ వైపే అనుకున్నారు.అయితే తాజాగా టీపీసీ అధ్యక్ష పదవికోసం లాబీయింగ్ మొదలెట్టారట. మరి సర్వే ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news