Breaking : బొమ్మనహాల్ ప్రమాద కుటుంబాలకు ఎపిఎస్పీడీసీఎల్ రూ.5లక్షలు ఎక్స్‌ గ్రేషియా

-

ఎపిఎసిడిసిఎల్ పరిధిలోని అనంతపురం జిల్లా, బొమ్మనహాల్ మండలం, దర్గా హొన్నూరు గ్రామ సమీపంలో బుధవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. కాగా, ఇన్సులేటర్ ఫ్లాష్ అవ్వడంతో కండక్టర్ తెగిపోయి ఈ ప్రమాదం సంభవించినట్లు తెలియజేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎపిఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ (పి&ఎంఎం) డి.వి. చలపతి నేతృత్వంలో చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ&యం) కె. గురవయ్య, విజిలెన్స్ ఇన్స్ పెక్టర్ (అనంతపురం) యం. విజయ భాస్కర్ రెడ్డిలతో కమిటీని నియమించినట్లు తెలిపారు.

ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ ప్రమాదానికి బాధ్యులుగా భావిస్తూ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కళ్యాణ దుర్గం) ఎస్. మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బొమ్మనహాళ్) ఎం.కె. లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రొటెక్షన్) హెచ్, హమీదుల్లా బేగ్, లైన్ మ్యాన్ ( దర్గా హొన్నూర్) కె బసవ రాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు. అదేవిధంగా అనంతపురం సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్స్/ రాయదుర్గం) శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (యం &పి/ అనంతపురం) కె. రమేష్ ల నుంచి వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version