మునుగోడు ఉపఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ షురూ కానుంది. అధికారులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు.. సిబ్బంది మునుగోడు నియోజకవర్గానికి చేరుకున్నారు. మరోవైపు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసు సిబ్బంది కూడా నియోజకవర్గంలో పాగా వేశారు.
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సజావుగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. ఏజెంట్లు 5.30 గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని వెల్లడించారు. వీటన్నింటిన సీఈఓ కార్యాలయంతో పాటు ఈసీ నుంచి పర్యవేక్షణ ఉంటుందని వివరించారు.
నియోజకవర్గంలో అంతటా తనిఖీలు కొనసాగుతున్నాయని వికాస్ రాజ్ తెలిపారు. రేపు తెల్లవారుజాము వరకు అధికారులు గట్టి బందోబస్తు నిర్వహిస్తూ తనిఖీలు సాగిస్తారని వెల్లడించారు. నియోజకవర్గంలో నగదు, మద్యం పంపిణీ జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మునుగోడు ప్రచారం ఒక్క చోట మినహా అంతటా ప్రశాంతంగా సాగిందని అన్నారు. నిన్నటి ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.