కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులే మన కుటుంబ సభ్యుల ప్రాణాల మీదకు వస్తుంటాయి. అయితే కొన్ని సమయాల్లో మనం కావాలని తప్పుగా ప్రవర్తించం.. కానీ.. అనుకోకుండా మన కుటుంబ సభ్యులు లేదా బంధువులు, స్నేహితుల ప్రాణాలు పోతాయి. మనం చేసే పనులకు వారు కొన్నిసార్లు అలా శిక్ష అనుభవిస్తారు. రాజస్థాన్‌లోనూ సరిగ్గా ఇలాగే జరిగింది.
రాజస్థాన్‌లోని మహారావు భీమ్‌సింగ్ (ఎంబీఎస్) హాస్పిటల్ లో ఓ వ్యక్తి కోవిడ్ 19 కారణంగా వెంటిలేటర్‌పై ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతన్ని చూసేందుకు అతని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు వచ్చారు. వారు తమతోపాటు ఓ చిన్నపాటి కూలర్‌ను తెచ్చారు. ఐసీయూలోకి వెళ్లగానే వారు ఆ కూలర్‌ను ఆన్ చేసేందుకు అక్కడే ఉన్న వెంటిలేటర్ ప్లగ్‌ను ఊడబీకారు. దాని స్థానంలో కూలర్ ప్లగ్ పెట్టి దాన్ని ఆన్ చేశారు.
అయితే కొంత సేపటి వరకు వెంటిలేటర్ బ్యాటరీపై నడిచింది. కానీ అందులో పవర్ బ్యాకప్ కూడా అయిపోవడంతో వెంటిలేటర్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. కాగా ఈ ఘటనపై అక్కడ అధికారులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. ఏది ఏమైనా.. ఇలా ఎవరికీ జరగకూడదు. వారు చేసిన ఒక చిన్న తప్పు తమ కుటుంబ సభ్యున్ని బలి తీసుకుంది.