మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం కస్తూరినగరంలో పదిమంది రైతులు విద్యుత్ హైటెన్షన్ స్థంబాలెక్కిన ఘటన కలకలం రేపుతోంది. మొక్కజొన్న పంటసాగుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, పోడు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పది మంది రైతులు. ప్రభుత్వం స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని కిందకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక మొక్కజొన్నపంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు చెబుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయని అంటున్నారు. ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనే కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాల విధానం, దాంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెద్దఎత్తున తగ్గించడం, పేదరైతు పాలిట శాపంగా పరిణమించిందని చెబుతున్నారు.