ఇండియాలో అనాస పళ్ల సాగు పెద్ద ఎత్తున సాగుతుంది. మన దేశం నుంచి అనేక దేశాలకు ఎగుమతి చేసే పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. ఈశాన్య రాష్ట్రాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్ అంటే.. మనం డైరెక్టుగా తింటాం లేదా జ్యూస్ చేసుకుని తాగుతాం.. పైనాపిల్ ఉత్పత్తులను కూడా ప్రాసెసింగ్ చేస్తూ.. రైతులు అధిక లాభాలను గడిస్తున్నారు. ఇలా ప్రాసెసింగ్ చేసి.. పైనాపిల్ ను ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేసుకోవచ్చట. ఇంతకీ ఏ ఏ రాష్ట్రాల్లో ఈ దందా నడుస్తుంది, కథేంటో చూద్దామా..!
ఏఏ రాష్ట్రాల్లో సాగు చేస్తారంటే:
అస్సాం, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మిజోరాం, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక , గోవా వంటి రాష్ట్రాల్లో పైనాపిల్ సాగు పెద్దఎత్తున సాగుతుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో కూడా అక్కడక్కడ అనాసపళ్లను సాగుచేస్తున్నారు.
లక్ష హెక్టార్లలో పైనాపిల్ సాగు:
మన దేశంలో సంవత్సరానికి 92 వేల హెక్టార్లలో 14 లక్షల 96 వేల టన్నుల ఫైనాఫిల్స్ ను ఉత్పత్తి చేస్తున్నారు. పైనాపిల్‌లో విటమిన్ ఎ, బి, సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పోషకాహారం సమృద్ధిగా ఉండటంతో దీని రసానికి మాంచి గిరాకీ ఉంది. విదేశాల్లోనూ ఇండియన్ పైనాపిల్‌కు చాలా డిమాండ్ ఉందట.. APEDA ద్వారా త్రిపుర నుండి అనేక దేశాలకు పైనాపిల్ కూడా ఎగుమతి చేస్తారు.
ఆలోచనలో మార్పు:
రైతులు అనాసపళ్ళను ప్రాసెస్ చేస్తూ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అధునిక సాంకేతికత నైపుణ్యాన్ని ఉపయోగించి రైతులు తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నారు. ఇంతకుముందు రెండేళ్లకు ఒకసారి దిగుబడి ఇస్తే.. ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే నాణ్యమైన దిగుబడి పంటను ఉత్పత్తి చేస్తున్నారు.
పెద్దఎత్తున పైనాపిల్ సాగు చేస్తున్న రైతులు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వలన రైతుల సంపాదన పెరగడంతో పాటు ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఎక్కువ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడంలో కూడా ఇబ్బంది పడ్డారు.. అయితే ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్ ను మొదలు పెట్టి.. అనాసను నిల్వ చేస్తుండడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
పైనాపిల్‌ను ఎలా ప్రాసెస్ చేస్తున్నారంటే
పైనాపిల్ ప్రాసెసింగ్ కోసం, మొదట అనాస పండు నుండి పై భాగం వేరు చేస్తారు. యంత్రం సహాయంతో పై తొక్కను తొలగిస్తారు. ఆ తర్వాత అనాసను శుభ్రం చేస్తారు. యంత్రం సహాయంతోనే పండును గుండ్రని ముక్కలుగా కట్ చేసి డబ్బాల్లో నింపుతారు. ఈ ప్రక్రియ అనంతరం పెద్ద ట్యాంకుల్లో చక్కెర, ఇతర ముఖ్యమైన వస్తువులను వేసి.. మిశ్రమం తయారు చేస్తారు. ఈ షుగర్ మిశ్రమాన్ని.. పైనాపిల్ బాక్సుల్లో నింపి ప్యాక్ చేస్తారు. ఆ తర్వాత ఈ ప్యాక్ ను వేడి నీటిలో ఉంచుతారు. ఆపై చల్లని నీటిలో ఉంచుతారు. ఇలా ప్రాసెస్ చేసిన ఫైనాపిల్ మిశ్రమం ఒక సంవత్సరం వరకూ సురక్షితంగా ఉంటుందట. అంతే..ప్రాసెస్ చేసిన ఫైనాపిల్ ను అమ్మకానికి మార్కెట్ కు సప్లై చేస్తున్నారు. ఈ కొత్త విధానంతో.. రైతులు మరింత ఆదాయాన్ని పొందుతున్నారు.