ఆఫ్రికా నుంచి ఉపాది కోసం గల్ఫ్ దేశాలకు వస్తున్న శరణార్థులు, వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ యెమెన్ తీరంలో మునిగిపోయింది. ఈ ఘోర విషాద ఘటనలో 68 మంది మరణించగా, మరో 74 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ వెల్లడించింది. ఈ పడవలో మొత్తం 154 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరంతా ఇథియోపియన్లు అని ఐఓఎం యెమెన్ విభాగాధిపతి అబ్దుసత్తర్ ఎసోవ్ తెలిపారు. ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున యెమెన్ లోని అబియాన్ ప్రావిన్స్ తీరంలో, గల్ఫ్ ఆఫ్ అడెన్ సమీపంలో చోటుచేసుకుంది.
సముద్రంలో మునిగిన పడవలో 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, వారిలో ఒకరు యెమెన్ దేశస్థుడు కాగా, మిగిలిన 11 మంది ఇథియోపియన్లు అని ఆయన వివరించారు. మరణించినవారిలో 54 మంది మృతదేహాలు ఖన్ఫర్ జిల్లా తీరంలో లభ్యమయ్యాయని, మరో 14 మృతదేహాలను జింజిబార్ నగరంలోని ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, బలమైన అలల కారణంగా గాలింపు చర్యలు కష్టంగా మారింది.