ఏపీలోని బాపట్ల జిల్లా బల్లికురవ లో నేడు జరిగిన గ్రానైట్ క్వారీ ప్రమాదం లో ఆరుగురు మృతి చెందగా.. 10 మందికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.14 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసినట్టు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి పేర్కొన్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆసుపత్రి ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ తెలియజేశారు. గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి అక్కడే పని చేస్తున్న కార్మికుల మీద పడటంతో ఈ ప్రమాదం జరగగా.. మృతులు ఒడిశా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో 16 మంది పని చేస్తుండగా మిగతా వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.