మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది, ఇందులో తండ్రి తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నందుకు కిరాతకంగా కాల్చి చంపాడు. శనివారం రాత్రి, బంధువుల ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు తన భర్తతో కలిసి హాజరైన కుమార్తెను తండ్రి అక్కడికి చేరుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే, జల్గావ్కు చెందిన 24 ఏళ్ల తృప్తి , 28 ఏళ్ల అవినాష్ వాగ్ ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. కానీ, తృప్తి తండ్రి కిరణ్ మాంగ్లే, ఒక రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఎస్ఐ, ఈ వివాహాన్ని అనుకూలించలేదు. అప్పటి నుంచి తన కూతురు , అల్లుడిపై ఆయన కోపంతో ఉన్నారు.
శనివారం రాత్రి, చోప్డా పట్టణంలో అవినాష్ సోదరి హల్దీ (పసుపు వేడుక) కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకకు తృప్తి, అవినాష్ దంపతులు హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలిసిన కిరణ్ మాంగ్లే తీవ్ర ఆగ్రహంతో అక్కడికి చేరుకున్నారు. ఆయన వెంట తీసుకున్న సర్వీస్ రివాల్వర్‌తో తన కూతురు తృప్తిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తృప్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన అవినాష్ వాగ్ కూడా కాల్పుల్లో గాయపడ్డాడు. పెళ్లి వేడుకకు హాజరైన బంధువులు, అతిథులు ఈ దారుణ ఘటనను కళ్ళారా చూసి ఆగ్రహంతో కిరణ్ మాంగ్లేను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో కిరణ్ కూడా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, తృప్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ అవినాష్‌ను, కిరణ్ మాంగ్లేను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.