కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. దీనితో ప్రజలు రోడ్ల మీదకు రావాలి అంటే చాలు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. లాక్ డౌన్ విషయంలో మాత్రం ఇప్పుడు ఎక్కడా కూడా ప్రభుత్వాలు వెనకడుగు వేయడం లేదు. చాలా మంది అవసరం ఉన్నా సరే భయపడి ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.
తాజాగా తల్లి తండ్రులు కన్న కూతురి చివరి చూపు కూడా నోచుకోలేకపోయారు. వీడియో కాల్ లో అంత్యక్రియలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం తుంగూరుకి చెందిన పాలాజీ భాస్కర్, సునీత దంపతులకు 11 ఏళ్ళ కుమార్తె సాహిత్య ఉంది. ఆమె కొన్ని రోజులుగా షుగర్ వ్యాధితో బాధపడుతుండగా… ఆమెకు వైద్యం చేయించడానికి భారీగా అప్పులు చేసింది కుటుంబం.
అప్పులు తీర్చడం కోసం తండ్రి దుబాయ్ వెళ్ళాడు. ఆమె ఆరోగ్యం శుక్రవారం విషమించడంతో విషయాన్ని కుటుంబ సభ్యులు ఆయనకు చెప్పారు. అయితే విమానాలు లేకపోవడంతో అక్కడి నుంచి రాలేకపోయారు. దీనితో బంధువులు కుమార్తె అంత్యక్రియలు వీడియో కాల్ లో చూపించారు. తల్లి దగ్గర డబ్బులు లేకపోవడంతో స్థానికులే డబ్బులు ఇచ్చి అంత్యక్రియలను పూర్తి చేసారు. ఈ ఘటన ఇప్పుడు అందరిని కన్నీళ్లు పెట్టిస్తుంది.