కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను చాలా కఠినంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో అయితే మరీ స్ట్రిక్ట్‌గా 144 సెక్షన్ విధించి మరీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ షాపులను మధ్యాహ్నం 2 గంటల లోపు మూసివేయాల్సి ఉంటుంది. అయితే ఆ బేకరీ ఓనర్ మాత్రం లాక్‌డౌన్ ఉన్నప్పటికీ తాను తయారు చేసే బ్రెడ్‌లను రోజు మొత్తం విక్రయిస్తున్నాడు. అందుకు గాను అతను ఓ వినూత్నమైన ఆలోచన చేశాడు. అదేమిటంటే…
కోయంబత్తూరు సిటీలోని రతినపురి అనే ప్రాంతంలో విఘ్నేష్ అనే వ్యక్తి ముండ్రు కంబమ్ నెల్లై ముత్తు విలాస్ స్వీట్స్ అండ్ బేక్స్ పేరిట ఓ బేకరీ కమ్ స్వీట్ షాపును నిర్వహిస్తున్నాడు. అయితే షాపులను మధ్యాహ్నం 2 గంటలకే మూసివేయాల్సి వస్తుండడంతో.. బ్రెడ్ ప్రియుల కోసం బ్రెడ్‌ను వినూత్నంగా అమ్మే ఏర్పాటు చేశాడు. అందుకు గాను అతను తన షాపు ఎదుట ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసి అందులో బ్రెడ్ ప్యాకెట్లను ఉంచాడు. పక్కనే మరొక బాక్సును పెట్టాడు. ఇక ఆ స్టాల్ ఎదుట ఓ బోర్డు పెట్టాడు.
ఎవరైనా సరే.. ఆ స్టాల్‌లో ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటే.. రూ.30 లను పక్కనే ఉన్న బాక్సులో వేయాలి. ఈ క్రమంలో చాలా మంది ఈ ఐడియాకు ఫిదా అయిపోయారు. బ్రెడ్ తీసుకుని క్యాష్‌ను బాక్సులో వేస్తున్నారు. ఇక షాపు మూసి ఉన్నప్పటికీ విఘ్నేష్ మాత్రం ఆ స్టాల్‌ను రాత్రి వరకు ఓపెన్ చేసే ఉంచుతున్నాడు. అక్కడ అతను ఉండకపోయినా.. అనేక మంది బ్రెడ్ లవర్స్ బ్రెడ్‌ను కొనుగోలు చేసి క్యాష్‌ను బాక్సులో వేస్తున్నారు. ఇక ఆ స్టాల్‌ను ఓపెన్ చేసి ఇప్పటికీ రెండు రోజులే అయినా.. విపరీతమైన స్పందన వస్తుందని విఘ్నేష్ అంటున్నాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆహారం దొరకని వారికి ఇలా సదుపాయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అతను అభిప్రాయపడుతున్నాడు. ఏది ఏమైనా.. విఘ్నేష్ చేసిన వినూత్న ప్రయోగాన్ని మనం మెచ్చుకోవాల్సిందే..!