హైదరాబాద్‌లో ట్విట్టర్‌, వాట్సాప్‌, టిక్‌టాక్‌లపై కేసు నమోదు.. ఎందుకంటే..?

-

ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌ ట్విట్టర్‌, వాట్సాప్‌, టిక్‌టాక్‌లపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. నాంపల్లి కోర్టులో ఎస్‌.శ్రీశైలం అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఆ సంస్థలపై కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజులుగా ఈశాన్య ఢిల్లీలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ బిల్లులకు వ్యతిరేకంగా కొనసాగిన నిరసనలు తీవ్రతరం కాగా.. ఆ నిరసనల్లో పలువురు మృతి చెందారు. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జాతి వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, అందులో భాగంగానే సోషల్‌ మీడియాలోనూ పలువురు ఆ కార్యకలాపాలను ప్రోత్సహించేవిధంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ తాజాగా ఎస్‌.శ్రీశైలం అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఈశాన్య ఢిల్లీలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ బిల్లులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలను దృష్టిలో ఉంచుకుని కొందరు పాకిస్థానీలు వాట్సాప్‌లో 1200 వరకు గ్రూప్‌లను క్రియేట్‌ చేశారని, వారు దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించేవిధంగా పోస్టులు పెడుతున్నారని శ్రీశైలం అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే సదరు పోస్టులను తిరస్కరించకుండా వాటిని పోస్టు చేసేందుకు అనుమతినిస్తున్నందుకు గాను వాట్సాప్‌, ట్విట్టర్‌, టిక్‌టాక్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతను ఫిర్యాదు చేయగా, సైబర్‌ క్రైం పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం, వాటిని ప్రోత్సహించడం నేరమవుతుందని, అందుకు గాను ఆయా సోషల్‌ మీడియా సంస్థలపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్లు 153ఎ, 121ఎ, 294, 295, 505, 120బి, 156(3) ప్రకారం కేసులు నమోదు చేశామని సైబర్‌ క్రైమ్స్‌ అడిషనల్‌ డీసీపీ రఘువీర్‌ మీడియాకు తెలిపారు. దేశ సమైక్యతకు భంగం కలిగించే విధంగా ఎవరైనా సరే అలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులను త్వరలోనే గుర్తిస్తామని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version