మీరు ఎన్నో మార్కెట్లను చూసుంటారు. కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, చికెన్, మటన్ మార్కెట్.. ఇలా రకరకాల మార్కెట్లను చూసుంటారు కానీ.. ఎలుక మాంసాన్ని అమ్మే మార్కెట్ ను చూశారా ఎప్పుడైనా.. ఎక్కడైనా. చూడలేదంటే మీరు అస్సాం వెళ్లాల్సిందే. అవును.. బక్సా జిల్లా ఉన్న కుమరికట మార్కెట్ కు వెళ్తే మీకు ఎక్కడ చూసినా ఎలుకల మాంసమే కనిపిస్తుంది. జనాలంతా ఎలుక మాంసం కొనడం కోసం పోటీ పడుతుంటారు. చికెన్, మటన్ కంటే కూడా ఎలుక మాంసాన్ని తినడానికే అక్కడి జనాలు ఇష్టపడతారట.
వారాంతపు మార్కెట్ అది. వారానికి ఒకరోజు మాత్రమే ఆ మార్కెట్ లో ఎలుకల మాంసం దొరుకుతుంది. వారానికి ఒక రోజు మాత్రమే ఎలుకల మాంసం దొరుకుతుంది కాబట్టి జనాలు కూడా ఎగబడతారు. కిలో ఎలుక మాంసం 200 రూపాయలు పలుకుతుందట.
ఎలుకలను అస్సాంలోని నైబరి, బర్పెట ప్రాంతాల నుంచి పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతారట. ప్రతి ఆదివారం మాత్రమే ఈ మార్కెట్ ఉంటుందట. ఎలుక మాంసంతో పాటు ఇక్కడ పంది మాంసాన్ని కూడా అమ్ముతారట. దానికి కూడా గిరాకీ బాగానే ఉంటుందట.
యాక్.. ఎలుకల మాంసం, పంది మాంసం తినడం ఏంది అని చాలామంది చీదరించుకోవచ్చు. కానీ… అక్కడి ప్రజలకు అదే జీవనోపాధి. వాళ్లు మూడు పూటలు తినాలంటే ఎలుకలను పట్టుకొచ్చి ఆ మార్కెట్ లో అమ్మాల్సిందే. లేకపోతే పస్తులుండాల్సిందే.