చర్మ సంరక్షణ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయుర్వేదంలోని మూలికల విలువ చెప్పుకోదగినది. ఆ మూలికల్లో కొన్ని పువ్వులు కూడా ఉన్నాయి. ప్రకృతి ప్రసాదించిన పువ్వులు రంగు రంగుల ప్రపంచాన్ని కళ్ళకి చూపడమే కాదు అందమైన చర్మాన్ని మనకందిస్తాయి. చామంతి పువ్వు నుండి మల్లెమొగ్గ వరకు ప్రతీ పూవు మనకి లాభదాయకమే. చర్మ సంరక్షణలో పూల పాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అపరాజిత
అపరాజితగా పిలవబడే ఈ పువ్వులో యాంటీఅక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. మృదువైన చర్మాన్ని తీసుకురావడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. చర్మంపై కలిగే చిరాకును తగ్గిస్తుంది. మొటిమల ద్వారా ఏర్పడే ఎర్రదనం, పొడిబారిన చర్మం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా అన్ని రకాలుగా కాపాడుతుంది.
బంతిపువ్వు
శీతాకాలంలో విరివిగా పూసే బంతిపువ్వుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ సంరక్షణలో చాలా ఉపయోగపడుతుంది. ఈ బంతిపువ్వు రేకులతో చిన్న పిల్లలకి స్నానం చేయిస్తే దురద, మంటలు వంటివి తగ్గుతాయి.
మల్లె
రకరకాల చర్మ సంరక్షణ సాధనాల్లో వాడే మల్లెపువ్వుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులేదు. మల్లెపువ్వులని తీసుకుని మినరల్ వాటర్ డబ్బాలో పోసి, ఒక రాత్రంతా అలాగే ఉంచి తెల్లారగానే ఆ నీళ్ళని వడకట్టి, దాన్ని ఒక బాటిల్ లో నింపుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని ప్రతిరోజూఈ చర్మానికి అప్లై చేయండి. తేడా మీకే తెలుస్తుంది.
చేమంతి
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్న చేమంతులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి చికాకు కలిగించే దురద, ఎర్రదనాన్ని దూరం చేయడంలో ఇది బాగా సాయం చేస్తుంది. చేమంతులతో చేసిన నూనెలు, ఫేస్ ప్యాక్ క్రీముల్లో మార్కెట్లో దొరుకుతాయి.